నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో(Nizamabad )విషాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కాలువలో పడిపోయిన బాలిక అను (2) శవమై(Girl die) తేలింది. ఆనంద్ నగర్ కాలనీలోని నాలాలో కొట్టుకు వచ్చిన ఆమె మృతదేహాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ సిబ్బంది వెలికి తీశారు. రెండేళ్ల చిన్నారి అను మృతదేహాన్ని చూసి కుటుంబీకులు కన్నీరు మున్నీరు అయ్యారు. దాదాపుగా 12 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగినట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ పేర్కొన్నారు.
కాగా, స్థానిక వర్ని రోడ్ ప్రాంతంలోని అటవీ కార్యాలయం వద్ద గల నివాస గృహాల ముందు నుంచి పెద్ద మురికి కాలువ(Dirty drain) ప్రవహిస్తుంది. అదే ప్రాంతంలో నివాసముండే రెండేళ్ల చిన్నారి బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. ఇంట్లో పని ముగించుకుని బయటకు వచ్చిన తల్లి పాప కోసం గాలించగా కనిపించలేదు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిండుగా ప్రవహిస్తున్న కాలువలో బాలిక పడిపోయినట్లు గుర్తించి చుట్టుపక్కల వారికి సమాచారమిచ్చింది. డిజాస్టర్ మేనేజ్మెంట్, మున్సిపల్ సిబ్బంది అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం అను శవమై తేలడం పలువురిని కట్టతడి పెట్టించింది.