నెక్కొండ, జూన్ 5: నెక్కొండ మండలం కస్నాతండా శివారు రాంనగర్ కాలనీలో బొడ్రాయి( గ్రామదేవత), ఆంజనేయస్వామి ప్రతిష్టాపన ఉత్సవాలు కన్నుల పండువగా సాగాయి. సోమవారం నుండి మొదలైన ఉత్సవాలు బుధవారం ముగిసాయి. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా పూజలు, హోమాలు సాగాయి. గణపతి ఏకాశీతిపద వాస్తు క్షేత్రపాలక నవగ్రహ సర్వతోభద్ర మండల దేవతారాధన చేసి హోమాలు చేశారు. భూలక్ష్మి మహాలక్ష్మి సమేత భువనేశ్వర స్వామి వారికి, మూలమంత్ర హవనం నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం ఎంత విగ్రహ ప్రతిష్టాపన చేసి బలిహరణ చేశారు.
నెక్కొండ పురోహితులు , శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయాలు అర్చకులు బీబీఎన్ శాస్త్రి,వాస్తు జ్యోతిష వేద పండితులు శ్రావన్ శాస్త్రి, వాస్తు జ్యోతిష సిద్ధాంతి అన్వేష్ శాస్త్రి ఆధ్వర్యంలో బొడ్రాయి, ఆంజనేయస్వామి ప్రతిష్టాపన సాగింది. వైదిక క్రతువును కరీంనగర్ వేద పండితులు కొల్లాపురం సురేష్ శర్మ, విజయవాడ వేద పండితులు కల్లూరి కౌశిక్ శర్మ, హైదరాబాద్ వేద పండితులు దామెర హయగ్రీవాచార్యులు, భద్రాచలం వేద పాఠశాల అభ్యాసకులు ఎల్లాప్రగడ రిత్విక్ సాయిరాం, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు అర్చకులు గోపాలకృష్ణమూర్తి శర్మ, పురోహితులు వరప్రసాద్ శర్మ నిర్వహించగా ప్రతిష్టాపన కమిటీ సభ్యులు కుటుంబ సమేతంగా హోమాలు పూజలు కుంకుమార్చనలలో పాల్గొన్నారు. బొడ్రాయి ప్రతిష్ట కావడంతో కుటుంబ సభ్యులు బంధువుల రాకతో కస్నా తండా శివారు రామనగర్ లో పండుగ వాతావరణం నెలకొంది.