జయశంకర్ భూపాలపల్లి, జూన్ 8(నమస్తే తెలంగాణ) : సెల్ఫీ మోజుకు ఆరుగురు జలసమాధి అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద గోదావరిలో శనివారం గల్లంతైన ఆరుగురి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. ఈ ఘటన ఐదు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మహదేవపూర్ మండలం అంబటిపల్లికి చెందిన పట్టి వెంకటస్వామి ఇంట్లో ఈ నెల 5న జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు అంబటిపల్లికి చెందిన పట్టి మధుసూద న్ (18), పట్టి శివమనోజ్ (15), తొగరి రక్షిత్ (13), కర్ణాల సాగర్ (16), మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాం చరణ్ (17), పసుల రాహుల్ (19) వచ్చా రు.
పిల్లల కోరిక మేరకు పట్టి వెంకటస్వామి వారిని శనివారం మేడిగడ్డలోని గోదావరి తీరానికి ఈతకు తీసుకువెళ్లాడు. అందులో అతడి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. నీళ్లు ఎక్కువగా ఉన్నాయని లోనికి వెళ్లొద్దని వారించినా సెల్ఫీలు, రీల్స్ తీసుకుంటూ నీటిలో దిగారు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా నీటి ప్రవాహంలో మునిగిపోవడం గమనించిన వెంకటస్వామి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. కండ్లముందే తన ఇద్దరు కుమారులతోపాటు బంధువుల పిల్లలు నలుగురు గల్లంతు కావడంతో ఒడ్డున రోదిస్తూ బంధువులకు సమాచారం అందించాడు.
కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. సింగరేణి రెస్క్యూటీం గాలించినా ఆచూకీ దొరకలేదు. ఆదివారం తిరిగి గాలింపు చేపట్టగా మధ్యాహ్నం ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మహదేవపూర్ ప్రభుత్వ దవాఖానలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు డిమాండ్ చేశారు. కాగా, మంత్రి శ్రీధర్‌బాబు ఆదివారం రాత్రి అంబటిపల్లి గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియాతోపాటు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.