బోధన్: బోధన్ మాజీ శాసనసభ్యుడు మహమ్మద్ షకీల్ తల్లి, విశ్రాంత గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు షగుఫ్త ఆదిబ్ (77) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాదులో ఉంటున్న ఆమె గత రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికాగా చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్న ఆమె గురువారం తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో మృతి చెందారు.
బోధన్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆమె ఉపాధ్యాయురాలిగా, 2001 నుంచి బీటి నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు గా విధులు నిర్వహించి 2005లో పదవీ విరమణ పొందారు. తల్లి మృతి చెందిన విషయం తెలియగానే దుబాయ్ లో ఉంటున్న మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమీర్ హైదరాబాద్ కు వచ్చారు. అక్కడినుంచి బోధన్ లోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఆమె అంత్యక్రియలను గురువారం సాయంత్రం ఆచన్ పల్లిలో నిర్వహించనున్నారు. షకీల్ తల్లి మృతి పై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.