Mana Ooru Mana Badi | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సర్కారు బడుల రూపురేఖలు మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వం మూడు విడతల్లో ప్రణాళికలు రూపొందించింది.
రాష్ట్రంలో 26,092 స్కూళ్లుండగా, మొదటి విడతలో 9,153 స్కూళ్లకు రూ. 3,497.62 కోట్లు కేటాయించి పనులు ప్రారంభించారు. ఇందులో పనులు పూర్తయిన 1200 పాఠశాలలను నిరుడు ప్రారంభించారు. మరికొన్ని పాఠశాలల్లో పనులు కొనసాగుతుండగానే.. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వంలో విద్యాశాఖను తన వద్దనే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల సచివాలయంలో ప్రభుత్వ పాఠశాలలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం ఊసేత్తకుండానే సర్కారు బడుల మరమ్మతులు, పెండింగ్పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా… బడుల పర్యవేక్షణ బాధ్యతలను ‘అమ్మ ఆదర్శ కమిటీలు’ అంటూ మహిళా సంఘాలకు అప్పగించారు. ఈ మేరకు మార్చి 12న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఇందులో 10 అంశాలను ఎంపిక చేసి, ఆయా పనులను ఈ కమిటీల ద్వారానే చేపట్టాలని సూచించింది.
స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పన, టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్తు సౌకర్యం, శానిటేషన్ సహా సివిల్వర్క్స్ ఉన్నాయి. ఇవేకాకుండా మేజర్, మైనర్ మరమ్మతులు కూడా చేపట్టాలని జీవోలో నిర్దేశించారు. ఇవే పనులు ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలోనూ ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమం పేరు లేకుండానే ఆయా పనులను చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. ఆయా పనులను చేపట్టేందుకు రూ.1100 కోట్ల నిధులను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది.
సీఎం ఆధీనంలో ఉండే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్), కలెక్టర్ ఆధీనంలో ఉండే జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్టు (డీఎంఎఫ్టీ) నిధుల్లో నుంచి డబ్బులు మంజూరుచేశారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ అనుమతులు, అంచనాలు రూపొందించే పని జరుగుతోంది. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఉన్నాయి.
ఈ సెలవుల్లో అన్ని రకాల పనులు, మరమ్మతులు పూర్తి చేయాలని గడువు విధించారు. దీంతో ఎక్కడా మన ఊరు -మన బడి కార్యక్రమం పేరు ఉపయోగించకపోవడంతో అసలు ఈ కార్యక్రమం ఉన్నట్టా..? లేనట్టా.. ?అను అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై అధికారులను ఆరా తీసినా తమకే సమాచారం లేదని స్పష్టంచేశారు.
