హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగుల కోపం కట్టలు తెంచుకున్నది. ఎన్నికల హామీలను అమలుచేయకపోవటంతో అసహనం వ్యక్తమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేసినా రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవటంతో నిరుద్యోగులు కాంగ్రెస్ అధిష్ఠానంతో పోరుకు సిద్ధమయ్యారు. రాహుల్‌గాంధీ స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. మీ (రాహుల్‌గాంధీ) హామీలు కూడా నీటిపై రాతలేనా? అని మండిపడుతున్నారు. వంద రోజుల్లో ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్ ప్రకటన ఏమైంది? గ్రూప్ పోస్టులను పెంచుతామన్న హామీ ఏమైంది? అని నిలదీశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఆరు నెలలు దాటినా హామీలు అమలు చేయరా? నిరుద్యోగులకు మీరిచ్చే విలువ ఇదేనా? అని ప్రశ్నించారు. నిరుద్యోగులు రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్, అశోక్‌నగర్, సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని అన్నారు. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను 183 నుంచి 2,000కు, గ్రూప్-3 పోస్టుల సంఖ్యను 1,365 నుంచి 3,000కు పెంచి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు దాటినా జాబ్ క్యాలెండర్, పోస్టుల పెంపు విషయంలో స్పందన రాలేదు. మీరు స్వయంగా వచ్చి నిరుద్యోగులకు ఈ హామీలు ఇచ్చినందున న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం’ అని లేఖలో రక్తపు సంతకం చేశారు.