హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్రంలోని బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వహణ, బలోపేతంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 63 బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వహణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్లడ్ బ్యాంకులను ఆధునీకరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినాచొంగ్తూ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కర్ణన్, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి, డీఎంఈ వాణి, టీవీవీపీ కమిషనర్ అజయ్‌కుమార్, ఐపీఎమ్ డైరెక్టర్ శివలీల, మెడికల్,హెల్త్ అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ పాల్గొన్నారు.