Kaleswaram | నిన్న మొన్నటిదాకా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని పొగిడారు. మోదీ ప్రభుత్వ విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతున్న నేపథ్యంలో, ఇప్పుడు అవే బీజేపీ నేతల నోళ్లు కాళేశ్వరంలో అవినీతి అంటూ బురద చల్లుతున్నాయి. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుల సందర్శన పేరుతో రాజకీయాలు చేస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం రికార్డు సృష్టించింది.
అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బ్రహ్మాండమైన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు జీవనాడిగా నిలిచి, రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసింది. గత కొన్ని దశాబ్దాల్లో లేనంతటి వరదలో రెండు పంపులు మునిగిపోతే ఇదే అదునుగా ఆరోపణలకు, విమర్శలకు తెగబడుతున్నారు కొందరు. ఈ నేపథ్యంలో కాళేశ్వరంపై ప్రత్యేకథనం.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషప్రచారానికి అంతులేకుండా పోతున్నది. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో వచ్చిన వరదలకు రెండు పంపు హౌజులు మునిగిపోవడం, ఈ మధ్య పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం కుదరని కేంద్రప్రభుత్వం తేల్చిచెప్పడంతో కొందరు నానా రచ్చచేస్తున్నారు.
ఈ కారణాలు చూపి.. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు దేనికీ పనికిరాదనీ, అదొక ‘వైట్ ఎలిఫెంట్’ అని కొందరు; తెలంగాణకు గుదిబండలా మారిందని కొందరు; లక్ష కోట్లు గోదారి పాలు అయ్యాయని మరి కొందరు నానా యాగి చేస్తున్నరు. అంతటితో ఆగకుండా.. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రావని ఇలా ఎవ్వరికి నచ్చినట్టు వాళ్లు విమర్శిస్తున్నరు.
మరి వాస్తవం ఏందీ? కాళేశ్వరం నిజంగనే దేనికి పనికిరాకుండా పోయిందా? దాని వల్ల తెలంగాణకు ఏం ఉపయోగం లేదా? అసలు కాళేశ్వరం కాకుండా… ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పాత డిజైన్ ప్రకారమే కడితే తెలంగాణకు లాభం జరిగేదా? ఒకవేళ అలాగే కడితే దానికెన్ని వేల కోట్లు ఖర్చు అయ్యేది? అనేవి ఆలోచించాల్సిన, తెలుసుకోవాల్సిన విషయాలు.
అలాగే మొన్న గోదావరిలో వచ్చిన వరదలకు మేడిగడ్డ, అన్నారం పంపు హౌజులు మునిగినాయి. దానికి కారణమేందీ? డిజైన్ లోపంవల్లే పంపులు మునిగినయా? లేకపోతే వరదలు రికార్డు స్థాయిలో రావడం వల్ల మునిగినయా ? అనే విషయాలపై కూడా విశ్లేషించుకోవాలె.
అలాగే.. మొన్న మునిగిన పంపుల్లో బాహుబలి పంపులున్నయనీ, కాళేశ్వరం మీద పెట్టిన లక్ష కోట్లు నీళ్ల పాలు అయినయనీ తప్పుడు ప్రచారం చేస్తున్నరు! అసలు బాహుబలి పంపులు ఎక్కడున్నయి? మీడియా ఛానెళ్లు, జర్నలిస్టులు కాళేశ్వరం మీద పనిగట్టుకుని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నరు? తెలియక చేస్తున్నారా? తెలిసీ, కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా.. అనే విషయాలను కూడా ఇవాళ తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కాళేశ్వరం మొదలు పెట్టిన కాన్నుంచి కొందరు ఇంజినీర్ల ముసుగులో, మేధావుల ముసుగులో దాన్ని వ్యతిరేకిస్తున్నరు. ‘ఎత్తిపోతలా? తిప్పి పోతలా’ అని ఎద్దేవా చేస్తూ పుస్తకాలు రాస్తున్నరు. ‘మల్లన్నసాగర్ కింద భూమిలోపల పర్రెలున్నయ్, భూకంపాలు వస్తయ్’ అని భయపెడుతున్నరు. ఇక రాజకీయ పార్టీల విమర్శలకు అంతూబొంతూ లేదు. వారి స్వార్థ రాజకీయ స్వలాభాల కోసం కాళేశ్వరంపై బురద చల్లుతున్నరు. వారి చెప్పుచేతుల్లో ఉండే మీడియాల్లో దుష్ప్రచారం చేస్తున్నరు. ఈ విమర్శలన్నీ ఎంత బూటకమైనవో, పసలేనివో తేటతెల్లం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలు, అసలు వాస్తవాలు ఇవి. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులున్నాయి. మొదటిది మేడిగడ్డ బ్యారేజ్, రెండవది అన్నారం బ్యారేజ్, మూడవది సుందిళ్ల బ్యారేజ్. మేడిగడ్డ బ్యారేజ్ వెనక పంపు పెట్టి.. అన్నారంలోకి..; అన్నారం వెనక పంపుపెట్టి సుందిళ్లలోకి..; సుందిళ్ల వెనక పంపు పెట్టి ఎల్లంపల్లిలోకి నీళ్లను ఎత్తిపోస్తరు. ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంకుకు..,అక్కడి నుంచి మిడ్ మానేరు రిజర్వాయర్‌కు.., అక్కడి నుంచి కిందున్న లోయర్ మానేరు డ్యామ్‌ను నింపుకోవడం.., పైన ఉన్న మలక్ పేట, అప్పర్‌మానేరు రిజర్వాయర్లను నింపుతారు.
వీటితో పాటు ఇటు సిద్దిపేట వైపున్న అనంతగిరి రిజర్వాయర్‌కు.., ఆన్నుంచి రంగనాయక సాగర్‌కు, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు నీళ్లు ఎత్తిపోస్తరు. మల్లన్న సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు స్టెబిలైజేషన్ కోసం కొన్ని నీళ్లు, కొత్తగా కట్టిన కొండపోచమ్మ రిజర్వాయ్ నింపుకోవడం.., దాంతో పాటు గందమల్ల, అక్కడినుంచి ఆఖరికి బస్వాపూర్ రిజర్వాయర్‌లోకి నీళ్లొస్తయ్. ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన రిజర్వాయర్ల క్రమం.
ఎల్లంపల్లి నుంచి మెజారిటీ ‘పాత ప్లాన్’ ‘ప్రాణహిత చేవెళ్ల’ ప్రకారమే జరిగింది. కానీ రిజర్వాయర్ల సామార్థ్యం పెరిగింది. ఇట్ల.. కాళేశ్వరం మొత్తంల మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులున్నయ్. దీని కింద 18 లక్షల 25 వేల ఎకరాల కొత్త ఆయకట్టు; శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు, వరదకాలువ కింద మరో 18 లక్షల 82 వేల ఎకరాలు స్థిరీకరణ చేయడంతో మొత్తంగా 37 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు హైదరాబాద్‌కు తాగునీళ్లు, పరిశ్రమలకు నీళ్లివ్వడం, కాళేశ్వరం పొడవునా ఉన్న గ్రామాలకు తాగునీరు ఇవ్వడం…క్లుప్తంగా ఇదీ కాళేశ్వరం ప్రాజెక్టు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్- పాత డిజైన్ ప్రకారం.. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టి, అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోసుకొని.. అక్కడి నుంచి మేడారం చెరువుకు, అటు నుంచి మోతెవాగుకు, అక్కడి నుంచి మిడ్ మానేరుకు, అనంతగిరి, ఇమామాబాద్ చెరువు, తడ్కపల్లి చెరువు… అటు నుంచి తిప్పారం చెవురుకు నీళ్లు వస్తయ్. ఇగ తిప్పారం నుంచి మూడు దిక్కుల నీళ్లు ఇవ్వొచ్చు.
ఇటు కుడి చెయ్యి దిక్కు పోతే.. హల్దీ వాగు, దౌల్తాబాద్, చేర్యాల, మూసీ నది మీదుగా చేవెళ్ల చెర్వుకు; మరో వైపు ముల్కపల్లి, జంగం పల్లి చెరువు, బస్వాపురం చెర్వు, చిట్యాల మండలం దాకా.. నీళ్లొస్తయ్. ఇంకో దిక్కు పాములపర్తి చెర్వును నింపుతారు. ఇదీ ప్రాణహిత చేవెళ్ల పాత డిజైన్. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 16 లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నది ప్లాన్.
కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ కింద సాగయ్యేది కొత్తగా 18 లక్షల 25 వేల ఎకరాలు, పాత ఆయకట్టు మరో 18 లక్షల 82 వేల ఎకరాలను స్థిరీకరించడం.. మొత్తంగా 37 లక్షల ఎకరాలకు నీళ్లివ్వొచ్చు. ఎల్లంపల్లి రిజర్వాయర్ కాస్త అటూఇటూ రెండు ఒకేలా ఉంటయ్.
కాకపోతే రిజర్వాయర్ల సామర్థ్యం, లిఫ్టుల సంఖ్య, కొన్ని కొత్త రిజర్వాయర్లు, కెనాళ్లు పెరిగినయ్. ఇవ్వన్ని పెరిగినయ్ కాబట్టి సాగు విస్తీర్ణం కూడా చాలా పెరిగింది. ఈ ప్రాజెక్టులో లొల్లంతా ఎక్కడ అంటే… మనం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి పోవాలే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. లొల్లంతా ఈ మూడు బ్యారేజీల మీదనే.., వీటి వెనకాల ఉన్న పంపుల మీదనే.
గోదావరిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత కింద కొంత దూరంలో 85 గేట్లతో ఈ మేడిగడ్డ బ్యారేజ్ కట్టినరు. దీంతో ఈ బ్యారేజ్ వెనక నీళ్లు ఆగుతయ్. అక్కడి నుంచి పంపులతో నీటిని ఎత్తిపోసుకుని.. గోదావరి నది వెంట ఒక 15 కిలోమీటర్ల పొడవున కాలువ ద్వారా నీళ్లు తీసుకుపోయి.. అన్నారం బ్యారేజీల పోస్తరు. దాంతో అన్నారం బ్యారేజ్ వెనక కూడా నీళ్లు నిలుస్తయ్ కదా.. వాటిని పంపుసెట్ల సాయంతో లిఫ్ట్ చేసుకొని.. రెండు కిలోమీటర్లు కాలువ ద్వారా తీసుకపోయి సుందిళ్ల బ్యారేజీల పోస్తరు. దీంతో సుందిళ్ల బ్యారేజ్ వెనకాల కూడా నీళ్లు నిలుస్తయ్. వీటిని పంపుల సాయంతో లిఫ్ట్ చేసి.. సుమారు కిలోమీటర్ పొడవు కాలువ ద్వారా తీసుకుపోయి ఎల్లంపెల్లిల పోస్తరు. ఇదీ ప్రాణహిత చేవెళ్ల రీడిజైనింగ్‌లో జరిగిన ప్రధాన మార్పు.
పైనున్న మహారాష్ట్ర సరిహద్దులో వాద్రా నది, వెయిన్‌గంగ నది కలిసిన తర్వాత.. ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టి అనే గ్రామం దగ్గర ప్రాణహిత నదిమీద ఒక బ్యారేజ్ కట్టి.., అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నేరుగా ఎల్లంపల్లిలో నీళ్లు పోయాలనేది పాత ప్లాన్.
తుమ్మిడిహెట్టి సముద్రమట్టానికి 148 మీటర్ల ఎత్తులో ఉంటది. ఎల్లంపల్లి కూడా సముద్రమట్టానికి 148 మీటర్ల ఎత్తులోనే ఉంటది. అంటే తుమ్మిడిహెట్టి దగ్గర ఓ 20 మీటర్లు ఎత్తిపోస్తే సక్కగొచ్చి ఎల్లంపల్లిల నీల్లు పడ్తయ్ కదా.. అదికాదని, దాన్ని పక్కనపెట్టి.. సముద్రమట్టానికి వంద మీటర్ల ఎత్తులో ఎక్కడో కింద ఉన్న మేడిగడ్డలో కట్టేసి, అక్కడినుంచి అన్నారం తెచ్చి… అక్కడి నుంచి సుందిళ్లకు తెచ్చి… సుందిళ్ల నుంచి ఎల్లంపెల్లిలో ఎందుకు పొయ్యాలే!
తుమ్మిడిహెట్టి దగ్గర ఒక్క పంపు పెడితే వచ్చే నీళ్లకు, ఇక్కడ మూడు పంపుసెట్లు, మూడు బ్యారేజీలు ఎందుకూ కట్టినట్టు? పైగా ఇన్నిసార్లు ఎత్తిపోస్తే వాటితో కరెంటు బిల్లు ఎంతొస్తది? దీంతో ఇచ్చే నీళ్లకంటే వచ్చే కరెంటు బిల్లే ఎక్కువ కాదా అని వాదిస్తున్నరు. ఇక కొందరైతే కమీషన్ల కోసమే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారని అంటున్నరు. కానీ.. వాస్తవాలు వేరే ఉన్నయ్.
ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడానికి చాలా కారణాలున్నయ్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పాత డిజైన్ ఎట్లుంటదంటే.. అరచేతిల తేనె పోసి మోచేతిని నాకించినట్టుంటది. ప్రాణహిత చేవెళ్లలో ప్రధానమైన తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్‌కి అనుమతులు లేవు, బ్యారేజ్ ఎత్తుమీద స్పష్టత లేదు. పైనున్న మహారాష్ట్రతో ఒప్పందం జరగలేదు. అక్కడ నీటి లభ్యతపై క్లారిటీ లేదు. ఉన్న నీటిలో పై రాష్ట్రాల వాటా ఎంతో తేల్చలేదు. అక్కడినుంచి ఎన్నీ నీళ్లు ఎత్తిపోసుకోగలగుతామో తెల్వదు.
ఇలా ఏ విషయాల మీద స్పష్టత లేకుండానే ప్రాజెక్టు ప్రారంభించి.. దానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి’ అని పేరు పెట్టారు. దానికి 2007 మే 16న రూ.17 వేల 875 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇస్తూ జీవో నెంబర్ 124ను జారీ చేసింది అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం. 19 నెలలు గడిచినా ప్రాజెక్టులో తట్టెడు మట్టి ఎత్తలే.
కానీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 38 వేల 500 కోట్లకు పెంచుతూ మళ్లీ 2008, డిసెంబర్ 17న జీవో నెంబర్ 238ని జారీ చేసింది. మళ్లీ 2010లో అంచనా వ్యయాన్ని 40 వేల 300 కోట్లకు సవరించి కేంద్రానికి డీపీఆర్ సమర్పించింది. పోనీ అప్పుడైనా పైనున్న మహారాష్ట్రతో ఓ ఒప్పందం చేసుకోవాలి కదా. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టే బ్యారేజ్ ఎత్తు మీద ఓ నిర్ణయానికి రావాలి కదా.
అవన్నీ ఏవీ లేకుండానే.. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ పనులు తప్ప, ప్రాజెక్టు తల నుంచి తోక దాకా పనులు ప్రారంభించారు. మరి ఎందుకు బ్యారేజ్ పనులు మొదలు పెట్టలేదంటే… బ్యారేజ్ 152 మీటర్లు కడ్తామని అప్పటి ఏపీ ప్రభుత్వం, లేదు లేదు 148 మీటర్లకు మించి ఒక్క అడుగు పెంచడానికి కూడా మేం ఒప్పుకోబోమని మహారాష్ట్ర ప్రభుత్వం పంతాలకు పోయాయి. ఎందుకంటే.. 152 మీటర్ల ఎత్తులో కడితే మహారాష్ట్రలో చాలా గ్రామాలు, వ్యవసాయ పొలాలు మునుగుతయ్.. దానికి మేం ఒప్పుకునే ప్రసక్తే లేదని అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. దీంతో తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ను ముట్టుకోకుండా కింద ప్రాజెక్టు పనులు ప్రారంభించింది అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం.
దీంతో 2013లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం- ‘మీరు మా అనుమతి లేకుండా, కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్‌ను ప్రతిపాదించి.. ఆ ప్రకారమే కింద కాల్వలు తవ్వుతున్నరు. మేం చెప్పినా వినకుండా… మీరు మొండిగా పనులు చేసుకుంట పోతే… మీరు పెట్టే ఆ 40 వేల 300 కోట్లు మట్టిల పోసుడు తప్ప మరేమీ కాదు. తుమ్మిడిహెట్టిలో మేం 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పుకునే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేస్తూ… 2013 అక్టోబర్ 15న అప్పటి ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు మహారాష్ట్ర రాశారు.
ఇక్కడే మనం మరో ముఖ్య విషయం చెప్పుకోవాలె. 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో, ఇటు ఉమ్మడి ఏపీలో, అటు మహారాష్ట్రలో మూడు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నయ్. కానీ.. కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకోలే. ఇక 2014 తర్వాత ప్రభుత్వాలు మారిపోయినయ్. కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ సర్కార్లు వచ్చినయి. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అప్పటికే ఈ ప్రాజెక్టుకు కేటాయించిన 40 వేల 300 కోట్లలో ఏడు వేల కోట్లు ఖర్చు చేసి.. అక్కడక్కడ కాల్వలు తొవ్విండ్రు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి రంగానికి ప్రథమ ప్రాధాన్యమిచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన నెలకే 2014 జూలైలో మహారాష్ట్ర సాగునీటి మంత్రితో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తును 152 మీటర్లకు ఒప్పించే ప్రయత్నం చేశారు. దానికి వాళ్లు ఒప్పుకోలే. ఆ తర్వాత.. 2015 ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ స్వయంగా ముంబై వెళ్లారు. అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్తో చర్చలు జరిపారు. కేసీఆర్ కూడా తుమ్మిడిహెట్టి దగ్గర 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా మహారాష్ట్రప్రభుత్వం ఒప్పుకోలేదు.
కానీ.. ‘మీరు 160 టీఎంసీల నీళ్లు వాడుకోవటానికి మాకు అభ్యంతరం లేదు. కానీ.. మా భూభాగాన్ని వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. మాకు ముంపు లేకుండా మీరు ఎన్ని నీళ్లయినా తీసుకోండి. తుమ్మిడిహెట్టి దగ్గరే కాకుండా మీరు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేద’ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. మన సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 2016 మార్చి 31న అసెంబ్లీలో చెప్పారు. ఇగ కేసీఆర్ ముంబై పర్యటన ముగించుకుని తెలంగాణ వచ్చిన 15 రోజుల్లోనే.. అంటే 2015 మార్చి 4న సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్యూసీ) ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు ఒక 10 పేజీల లేఖ రాసింది.
ఆ లేఖలో ఏమున్నదంటే.. ‘గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పంపిన నివేదికలో పైన ప్రాజెక్టుల అవసరాలు పోనూ తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత 273 టీఎంసీలని పేర్కొన్నది. కానీ అది తప్పు. ఇప్పుడు మా పరిశీలనలో తేలింది ఏందంటే.. తుమ్మిడిహెట్టి దగ్గర కేవలం 165 టీఎంసీల నీటి లభ్యతే ఉన్నది. అందులో కూడా భవిష్యత్తులో పై రాష్ర్టాలు 63 టీఎంసీలు వాడుకునే హక్కు ఉంటది’ అని లేఖ సారాంశం.
అంటే మనకు తుమ్మిడిహెట్టి దగ్గర లభ్యమయ్యే నీళ్లు102 టీఎంసీలు మాత్రమే. ఆ 102 టీఎంసీలలో మనం ఎత్తిపోసుకో గలిగేది 80 టీఎంసీలే. ఎందుకంటే 25శాతం ఆవిరి, ప్రవాహ నష్టాలు మినహాయిస్తే.. మనకు అక్కడ నికరంగా లభించే నీళ్లు 80 టీఎంసీలు మాత్రమే. అది కూడా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో కడితేనే.
కానీ.. 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు కదా. కాబట్టి మనం 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తోనే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మించుకోవాల్సి వస్తది. కట్ట ఎత్తు తగ్గింది కాబట్టి మనం ఎత్తిపోసుకునే నీళ్లు కూడా తగ్గుతయి. ఆ లెక్కన చూసుకుంటే తుమ్మిడిహెట్టి నుంచి 40 నుంచి 50 టీఎంసీలకు మించి ఎత్తిపోసుకోలేం. టీఎంసీకి 11 వేల ఎకరాల ఆయకట్టు వేసుకున్నా.. సరాసరిగా ఓ 45 టీఎంసీలు ఎత్తిపోసుకుంటే.. మొత్తం 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేం.
కానీ, ప్రాణహిత చేవెళ్ల డిజైన్ చేసింది 16 లక్షల 40 వేల ఎకరాలకు కదా. ఇక్కడనేమో 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు వచ్చే పరిస్తితి లేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా 2015 అక్టోబర్ 26న రెండు రాష్ర్టాల చీఫ్ ఇంజినీర్ల స్థాయి సమావేశం హైదరాబాద్‌లో జరిగినప్పుడు కూడా తుమ్మిడిహెట్టి బ్యారేజ్ 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు ఒప్పించే ప్రయత్నాలు జరిగినయ్. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
దీంతో ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రెండుగా విభజించింది. ఒకటి- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు, రెండవది- కాళేశ్వరం ప్రాజెక్టుగా విభజించింది. అందుకని తుమ్మిడి హెట్టి బ్యారేజ్‌ను 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ వద్ద నిర్మించి.. 20 టీఎంసీల నీటిని తరలించి.. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చేందుకు ప్రతిపాంచారు.
తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ ఉందని చెప్పిన సీడబ్ల్యూసీ మరో సూచన కూడా చేసింది. గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలిసిన తర్వాత.. దిగువ గోదావరిలో ఏటా 1650 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని పేర్కొన్నది. ఆ నీటిని వాడుకోకపోతే అవి సముద్రంలో వృథాగా కలిసిపోతాయని తెలిపింది.
అలాగే మేడిగడ్డ దగ్గర 284 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ రిపోర్టు పేర్కొన్నది. అయితే ఈ రిపోర్టును కూడా తప్పుపడుతున్నరు కొందరు మేధావులు! పైన తుమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీలే ఉన్నప్పుడు.. మేడిగడ్డ దగ్గర 284 టీఎంసీలు ఎలా ఉంటాయి? అని అంటున్నరు. పైన ఎంత ఉందో.. ఇక్కడ కూడా అంతే ఉండాలి కదా అనే వాదనలు చేస్తున్నరు.
ఇది ఎంత మూర్ఖపు వాదన అంటే… తుమ్మిడిహెట్టి పైన వాద్రా, వెయిన్‌గంగ కలిసి ప్రాణహితగా ఏర్పడుతుంది. అక్కడి నుంచి 113 కిలోమీటర్ల మేర ప్రవహించి భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో కలుస్తుంది.
అంటే.. ఒక నది 113 కిలోమీటర్లు ప్రవహిస్తుంటే.. దాని క్యాచ్మెంట్ ఏరియా ఎంతుంటది. ఆ మార్గ మధ్యంలో ఎలాంటి వాగులు, వంకలు, పిల్ల కాలువలు ఏవీ కలవవా? 113 కిలోమీటర్ల పొడవున వచ్చిన వర్షపునీటీ వరద ఎక్కడికి పోతది? ప్రాణహిత నదిలో కలవాల్సిందే కదా. అంతేకాదు ప్రాణహితలో కలిసే ఒక్క పెదవాగే 60 నుంచి 70 టీఎంసీల నీటిని మోసుకొస్తుంది.
అలాంటప్పుడు పైన తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న నీటి లభ్యత.., కింద మేడిగడ్డ దగ్గర ఉన్న నీటి లభ్యత.. ఒకటే ఎలా అవుతుంది? దానికి తోడు.. ఎల్లంపల్లి కింద గోదావరి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చిన వరద..; ఇటు మానేరు, లోయర్ మానేరు డ్యామ్ తర్వాత దాని క్యాచ్మెంట్ ఏరియా నుంచి వచ్చిన వరద ఎక్కడ పోతది? అది కూడా గోదావరిలో కలవాల్సిందే కదా. మేడిగడ్డకు రావాల్సిందే కదా. ఇవన్నీ కలిసి మేడిగడ్డ దగ్గర నికరంగా.. 75 శాతం విశ్వసనీయతతో 284 టీఎంసీల నీళ్లు లభ్యమైతయని సీడబ్ల్యూసీ రిపోర్టు ఇచ్చింది.
అయితే సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టును కూడా ఈ మేధావులు తప్పని వాదిస్తున్నరు. అంతేకాదు, ఏకంగా సీడబ్ల్యూసీని రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు చేస్తున్నరు. ఏదేమైనా.. మేడిగడ్డ దగ్గర 284 టీఎంసీల నీటి లభ్యత ఉంటదని స్పష్టంగా తేలటంతో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఇప్పుడు అర్థమైంది కదా.
అలాగే.. తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మారడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. 85 గేట్లు, 100 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో మేడిగడ్డ బ్యారేజ్ కట్టినరు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇదే మొదటి బ్యారేజ్. దీని నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు. దీనిపైన 119 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో అన్నారం బ్యారేజ్ కట్టినరు. దీని నీటి సామర్థ్యం 10.87 టీఎంసీలు. దానిపైన 130 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో సుందిళ్ల బ్యారేజ్‌ను కట్టినరు. దాని నీటి సామర్థ్యం 8.83 టీఎంసీలు. సుందిళ్ల నుంచి 148 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్లంపల్లి రిజర్వాయర్ కు నీళ్లు తరలిస్తరు. ఇక్కడ కూడా కొందరు తలాతోక లేని ఆరోపణలే చేస్తున్నరు. మేడిగడ్డ నుంచి ఎందుకు మూడు బ్యారేజీలు పెట్టడం.. నేరుగా ఎల్లంపల్లిలో ఎత్తిపోసుకోవచ్చు కదా అని. అందుకే వీళ్లది మూర్ఖపు వాదన అనేది.
మేడిగడ్డ, దాని కింద తుపాలకులగూడెం నుంచి ఎల్లంపల్లి దాకా.. దాదాపు 150 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదిలో సంవత్సరం పొడవునా నీళ్లుంటే.. అది తెలంగాణకు ఎంత ప్రయోజనం. ఎల్లంపల్లి రిజర్వాయర్‌ను వదిలెసినా… గోదావరి నది మీదనే.. మేడిగడ్డ దగ్గర 16 టీఎంసీలు, అన్నారం దగ్గర 11 టీఎంసీలు, సుందిళ్ల దగ్గర 8 టీఎంసీలు మొత్తం 35 టీఎంసీలు నిల్వ ఉంటయ్. ఆ నీళ్లను ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు. విమర్శలు చేస్తున్నవారు ఎందుకు ఈ స్టోరేజీని మర్చిపోతున్నరు!
అలాగే.. ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల పాత డిజైన్‌లో లోపాల గురించి మాట్లాడుకోవాలే.
పాత డిజైన్ ప్రకారం.. మొత్తం నిల్వ సామర్థ్యం ఎంత?
కొత్త రీడిజైనింగ్ ప్రకారం వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత? అనేది చూడాలి.
ప్రాణహిత చేవెళ్ల పాత డిజైన్ ప్రకారం.. నీళ్ల స్టోరేజీ కెపాసిటీ…
ప్రాణహిత బ్యారేజ్‌లో- 5 టీఎంసీలు
అనంతగిరి రిజర్వాయర్‌లో- 1.7 టీఎంసీలు
ఇమామాబాద్ రిజర్వాయర్‌లో -1.5 టీఎంసీలు
తడ్కపల్లి రిజర్వాయర్‌లో-1.5 టీఎంసీలు
తిప్పారం రిజర్వాయర్‌లో-1 టీఎంసీ
పాములపర్తి రిజర్వాయర్‌లో.. 1 టీఎంసీ
చేవెళ్ల రిజర్వాయర్‌లో- 3 టీఎంసీలు
మొత్తం అన్ని రిజర్వాయర్లలో కలిపి.. 14.7 టీఎంసీలు.
ఇదీ ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు’ పాత డిజైన్ ప్రకారం… ఆన్ లైన్ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం.
మేడిగడ్డ బ్యారేజ్‌లో- 16.17 టీఎంసీలు
అన్నారం బ్యారేజ్‌లో- 10.87 టీఎంసీలు
సుందిళ్ల బ్యారేజీలో- 8.83 టీఎంసీలు
మేడారం చెర్వులో- 0.78 టీఎంసీలు
అనంతగిరి రిజర్వాయర్‌లో- 3.5 టీఎంసీలు
శ్రీరంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో- 3 టీఎంసీలు
శ్రీకొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో- 50 టీఎంసీలు
(పాత డిజైన్‌లో తడ్కపల్లి అని 1.5 టీఎంసీలు ఉండే..)
ఇక మల్కపేట రిజర్వాయర్‌లో- 3 టీఎంసీలు
కొండ పోచమ్మ రిజర్వాయర్‌లో- 15 టీఎంసీలు
గంధమల్ల రిజర్వాయర్‌లో- 9.87 టీఎంసీలు
బస్వాపురం రిజర్వాయర్‌లో- 11.39 టీఎంసీలు
భూంపల్లి రిజర్వాయర్‌లో- 0.09 టీఎంసీలు
కొండెం చెరువులో- 3.50 టీఎంసీలు
తిమ్మక్కపల్లి రిజర్వాయర్‌లో- 1.5 టీఎంసీలు
దంతెపల్లి రిజర్వాయర్‌లో- 1 టీఎంసీ
ధర్మారావుపేట చెరువులో- 0.5 టీఎంసీ
ముద్దోజివాడి చెరువులో- 0.5 టీఎంసీ
కాటేవాడి చెరువులో- 0.5 టీఎంసీ
మోతే జలాశయంలో- 1 టీఎంసీ
ఈ మొత్తం కలిసి 141 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది.
ఇదీ రీడిజైన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆన్లైన్ రిజర్వాయర్ల సామర్థ్యం ఎక్కడి 14.7 టీఎంసీలు, ఎక్కడి 141 టీఎంసీలు. ఒకసారి అందరూ ఆలోచించాలే.
అట్లనే ఒకసారి మనం పాత కొత్త, కొత్త ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని కూడా చూడాలి. ప్రాణహిత చేవెళ్ల పాత డిజైన్ ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం 40 వేల 300 కోట్లు. దాని వల్ల కొత్తగా స్టోర్ చేసుకునే కెపాసిటీ 14.7 టీఎంసీలు.
అంటే.. 40వేల 300 కోట్లను 14.7 టీఎంసీలకు విభజిస్తే… ఒక్కో టీఎంసీని నిల్వ చేసుకోవడం కోసం 2471.49 కోట్లు ఖర్చు అవుతుంది.
కాళేశ్వరం మొత్తం వ్యయం ఎంత 80 వేల 190 కోట్లు. దీని వల్ల కొత్తగా స్టోర్ చేసుకునే కెపాసిటీ 141 టీఎంసీలు. అంటే.. 80 వేల 190 కోట్లను 141 టీఎంసీలకు డివైడ్ చేస్తే.. ఒక్కో టీఎంసీని స్టోర్ చెయ్యడం కోసం 568.72 కోట్లు ఖర్చు అయ్యిందన్నమాట. (ఇది కరెంటు బిల్లుకాదు. ఒక్క టీఎంసీని స్టోర్ చేసుకోవడానికి; బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంపుహౌజులు, టన్నెల్లకు అయిన ఖర్చు)
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారమైతే.. ఒక్క టీఎంసీ స్టోర్ చేసుకునేందుకు పెట్టే ఖర్చు 2471 కోట్లు అయితే, అదే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ స్టోరేజ్ కోసం 568 కోట్లు మాత్రమే. దానికి దీనికి ఎంత తేడానో గమనించారా..!
ఇప్పటికైనా అర్థమైంది కదా.. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేయడానికి కారణమేందంటే.. తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం. 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం. ప్రాజెక్టు మొత్తంలో కేవలం 14.7 టీఎంసీలు మాత్రమే ఆన్ లైన్ రిజర్వాయర్ల కెపాసిటీ ఉండటం. ఎక్కడన్నా ఒక దగ్గర పంపు చెడిపోయిందంటే.. మొత్తం నీటి సరఫరా ఆగిపోతది.
ఇక 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్తోనే తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కడితే.. కనీసం 5 లక్షల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేకపోయేవాళ్లం. కానీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ చేసిందేమో 16 లక్షల 40 వేల ఎకరాలకు. కాళేశ్వరంతో 18.25 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లివ్వడంతో పాటు.. పాత ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల కింద ఉన్న 18.85 లక్షల ఎకరాలను స్థిరీకరించుకునే అవకాశం ఉన్నది. ఈ అన్ని కారణాల వల్ల తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు మారింది.
ఇక ప్రాజెక్టుకు వ్యయం గురించి మాట్లాడుకోవాలె. ప్రాణహిత చేవెళ్ల పాత డిజైన్ ప్రకారమైతే 40 వేల 300 కోట్లతో పూర్తయ్యేది. అదే కాళేశ్వరం అయితే 80 వేల 190 కోట్లు అయినయ్ కదా అని వాదించే వాళ్లున్నరు. నిజమే. కానీ.. 40 వేల 300 కోట్లు 2010 నాటిది.
2010లో 40 వేల 300 కోట్లు అంటే.. పెరిగిన రేట్ల ప్రకారం అది 2016 నాటికి ఏటా 10 శాతం పెంపు వేసుకున్నా పాత ప్రాజెక్టు… పాత ప్లాన్ ప్రకారమే కట్టినా అది 65 వేల నుంచి 70 వేల కోట్లకు చేరేది. పైగా అంత ఖర్చు పెట్టినా దాంట్లో నీటి నిల్వ సామార్థ్యం కేవలం 14.7 టీఎంసీలు. సాగు విస్తీర్ణం కూడా 16 లక్షల 40 వేల ఎకరాలే.
అదే రీడిజైనింగ్ లో 141 టీఎంసీలు మనం నిల్వ చేసుకోవచ్చు. సాగు విస్తర్ణం కూడా కొత్తగా 18.25 లక్షల ఎకరాల ఆయకట్టు, మరో 18.85 లక్షల ఎకరాలను స్థిరీకరించడం చేయవచ్చు. అందుకని ప్రాజెక్టు అంచనా వ్యయం 80 వేల 190 కోట్లకు పెరిగింది. ఈ లెక్కన రీడిజైనింగ్‌లో మనం అధికంగా ఖర్చు చేసింది కేవలం 10 నుంచి 11 వేల కోట్లే.
కానీ.. బ్యారేజీలు పెరిగినయ్, పంపులు పెరిగినయ్, రిజర్వాయర్లు పెరిగినయ్, కాల్వలు పెరిగినయ్.. ఫలితంగా ఆయకట్టు కూడా పెరిగింది. పాత ప్లాన్ ప్రకారం 16 లక్షల 40 వేల ఎకరాలు. కొత్త ప్లాన్ ప్రకారం 37 లక్షల ఎకరాలు. తేడా లేదా!
ఇక, మల్లన్నసాగర్ దగ్గరికి వద్దాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఉన్న తడ్కపల్లి రిజర్వాయర్‌ను రీడిజైనింగ్‌లో భాగంగా మల్లన్న సాగర్‌గా మార్చినరు. తడ్కపల్లిలో ఒకటిన్నర టీఎంసీలే స్టోరేజ్ ఉండె. కానీ మల్లన్న సాగర్‌లో 50 టీఎంసీలు స్టోర్ చేసుకోవచ్చు. అయితే.. కృత్రిమంగా చుట్టూ కట్టలేసి నిర్మించిన ఈ రిజర్వాయర్ కింద భూమి పొరల్లో ఏవో లీనమెంట్లు (పగుళ్లు,పర్రెలు) ఉన్నాయని విష ప్రచారం చేస్తున్నరు. కానీ అదంతా తప్పుడు ప్రచారం. ప్రాజెక్టు మీద విషం చిమ్మడం కోసం కొందరి కుట్ర ప్రచారమిది.
ఎందుకంటే.. మల్లన్న సాగర్ రిజ్వారయర్ మీద పూణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ అనే సంస్థ ‘క్లియరెన్స్’ ఇచ్చింది. ఆధునిక శాస్త్రీయ అధ్యయనం చేసి మల్లన్న సాగర్ కింద ఎలాంటి లీనమెంట్లు లేవని, భూకంపాల లాంటివి వస్తాయనేది అవాస్తవమని రిపోర్టు ఇచ్చింది. దేశంలో ఎక్కడ ఏ పెద్ద ప్రాజెక్టులు కట్టినా పూణేలోని ఇదే సంస్థ వాటిని పరిశీలన, అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. అలాంటి సంస్థ మల్లన్న సాగర్‌కు క్లియరెన్స్ ఇచ్చింది. వాస్తవాలన్నీ ఈ విధంగా ఉంటే.. పగుళ్లు ఉనాయని ప్రచారంతో ఎలాగైనా ప్రాజెక్టు మీద బురద చల్లాలనే కుట్ర తప్ప ఇంకోటి కాదు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో కరెంట్ బిల్లు తడిసి మోపెడైతది, దాని నిర్వహణ ఖర్చు ఎక్కువైతది, ఈ ప్రాజెక్టుతో ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వాలంటే… 50 వేల ఖర్చొస్తదని ఒకాయన, లేదు లక్షా 50వేల ఖర్చొస్తదని ఒకయాన.. ఇట్ల ఎవని నోటికొచ్చింది వాళ్లు వాగుతున్నరు.
ప్రపంచంలో ఎక్కడైనా ఏ ఇరిగేషన్ ప్రాజెక్టును అయినా ఖర్చును దృష్టిలో ఉంచుకుని కట్టరనేది నిపుణుల మాట. ఏ ప్రాజెక్టును అయినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కడ్తరు. మనకు కావాలన్నప్పుడు అప్పటికప్పుడు కట్టేసుకుని నీళ్లు మల్పుకోవడం కుదరని పని. ఆ మాత్రం కూడా సోయి లేకుండా.. ఎకరానికి 50 వేలు, లక్షా యాభై వేలని కాకిలెక్కలు చెప్పటం కపటపూరితమే.
సరే.. ఆ మేధావులు చెప్పిన ప్రకారమే లెక్కిద్దాం. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోసిన నీళ్లు 96 టీఎంసీలు. వాటికి వచ్చిన కరెంట్ బిల్లు 2 వేల కోట్లు. ఒక్కో టీఎంసీకి 11 వేల ఎకరాలు సాగవుతుంది. అంటే 96 టీఎంసీల కు పది లక్షలా 56 ఎకరాలు పార్తయ్. రెండు వేల కోట్లు 10లక్షల 56 వేల ఎకరాలకు డివైడ్ చేస్తే.. 18 వేల 939 రూపాయలు. అంటే వాళ్లు చెప్తున్నదానికంటే తక్కువే కదా.
ఒక్క మాటలో చెప్పాలంటే.. నీళ్ల కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టినా తప్పులేదు. ఎందుకంటే నీళ్లు లేకపోతే జీవమే లేదు. నీళ్ల కోసం పెట్టే ఖర్చుకు లెక్కడమంటే.. మన ప్రాణానికి లెక్కకట్టినట్టే. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉంటే.. వ్యవసాయం ఉజ్వలంగా ఉంటది. రైతన్నలు సిరులు పండిస్తరు. దానికి 2018 నుంచి తెలంగాణలో పెరిగిన సాగే దానికి నిదర్శనం.
ఇక.. కాళేశ్వరం మీద జరుగుతున్న విషప్రచారం చూస్తే… లక్ష కోట్లు వరదలో కొట్టుకపోయినయ్. బాహుబలి పంపులు నీళ్ల పాలైనయ్. కాళేశ్వరం మనకు దేనికి పనికిరాదని తెగ ప్రచారం చేస్తున్నరు. నిజానికి.. మునిగిన రెండు పంపు హౌజుల్లో బాహుబలి పంపులే లేవు. గోదావరిలో మునిగినవి కన్నెపల్లి పంపులు, అన్నారం పంపులు. అవి బాహుబలి పంపులు కాదు. బాహుబలి పంపులున్నది.. పైన లక్ష్మీపూర్ దగ్గర.
ఈ మాత్రం గూడా సోయి లేకుండా కాళేశ్వరం మీద తీర్పులు ఇస్తున్నరు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు, గుజరాతీ బానిస మీడియా. పంపు హౌజులు మునగడం బాధకరమే. కానీ.. ఈ రెండు పంపులను బూచిగా చూపించి కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయిందని, దేనికి పనికిరాకుండా పోయిందని అనడం మూర్ఖత్వం. కపటత్వం.
సరే.. మరి పంపులు ఎందుకు మునిగినయ్ అంటే.. 2017 అక్టోబర్ 30న కేంద్ర జల సంఘం హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు.. కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో 28,80,829 క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద రాదని చెప్పింది. మేడిగడ్డ బ్యారేజిని ఈ వరదను తట్టుకునే విధంగానే డిజైన్ చేసినరు. 1986లో కాళేశ్వరం వద్ద నమోదు చేసిన గరిష్ట వరద మట్టం 107.05 మీటర్లు. ఈ మట్టాన్ని పరిగణలోకి తీసుకొని, బ్యారేజి కంట్రోల్ లెవెల్స్ మొదలైనవి నిర్ధారించారు. కరకట్టల నిర్మాణం, పంప్ హౌజ్‌ల నిర్మాణం చేశారు.
కేంద్ర జల సంఘం ప్రమాణాల ప్రకారం.. గోదావరినదిలో కాళేశ్వరం దగ్గర.. నది వరద మట్టం 103.5 మీటర్లు ఉంటే.. అది వార్నింగ్ లెవెల్‌గా పరిగణిస్తారు. నది 104.75 మీటర్ల మట్టం వద్ద ప్రవహిస్తుంటే అప్పుడు.. ప్రమాద స్థాయి దాటిందని చెప్పవచ్చు.
కానీ.. ఈ మధ్య కాళేశ్వరం వద్ద గోదావరి వరద మట్టం 108.19 మీటర్లు వచ్చింది. జూలై 13-14 తేదీల్లో 28 – 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని ఆంచానా. ఇవి తెలంగాణ ఇంజనీర్లు నమోదు చేసినవి కాదు. కేంద్ర జలసంఘం వారు నమోదు చేసినవి. ఈ అసాధారణ వరద కారణంగానే కన్నేపల్లి పంప్ హౌజ్ నీట మునిగిపోయింది. ఇందులో నాణ్యతా లోపం, డిజైన్ లోపం లేదు.
ఇక్కడే ఇంకో విషయం ఏమంటే.. గోదావరిలో వరద ఉధృతి రికార్డు స్థాయికి మించి వచ్చినప్పుడు.. గోదావరిలోకి వచ్చే వాగులు, కాలువల నీటిని తనలో చేర్చుకోదు. పైగా వెనక్కు తన్నుతుంది. దీంతో ఆయా వాగులు, కాలువల వెనక కూడా కొన్ని ప్రాంతాలు మునిగిపోతయ్. అలా మునిగిందే.. అన్నారం పంపౌజు. ఈ అనుభవాల నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరింత ఎత్తులో కడితే మంచిది.
చివరగా.. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక మాట చెప్పాలే. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, వాటి వెనకున్న పంపులే అని చాలా మంది అనుకుంటున్నరు. అవి మునిగితేనో, పనిచేయకపోతేనో ప్రాజెక్టు మొత్తం ఆగిపోయినట్లు అనుకుంటున్నరు. కానీ.. అది పొరపాటు. కాళేశ్వరాన్ని మనం మూడు భాగాలుగా చూడొచ్చు.
గత రెండేండ్ల నుంచి పడుతున్నట్టు జోరుగా వానలు పడి, గోదావరిలో పుష్కలంగా నీళ్లొస్తే… ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా మిడ్ మానేరు నుంచే కాళేశ్వరం మొత్తానికి నీళ్లివ్వొచ్చు. వర్షాలు తక్కువ పడితే.. కడెం ప్రాజెక్టు, దాని క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన వరద నీళ్లు, గోదావరి జలాలతో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకుని.. మిడ్ మానేరు నుంచి కాళేశ్వరం కిందున్న మొత్తానికి నీళ్వొచ్చు. పూర్తిగా వర్షాలు పడనప్పుడు.. కరువు వచ్చినప్పుడు.. మొదటున్న మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీళ్లు తెచ్చుకోవచ్చు.
ప్రాణహితలో ఎప్పుడూ నీళ్లు ఉంటయ్ కాబట్టి.. వరుసగా పదేండ్ల పాటు పెద్దగా వర్షాలు పడకపోయినా.. మనం మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకోవచ్చు. ఇలా.. మొత్తం మూడు విధాలుగా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవచ్చు. అంతేకానీ.. ఏదో రెండు పంపు హౌజులు మునిగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అంతా మునిగినట్టు కాదు. ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువు. దీంతో 13 జిల్లాల్లో 37 లక్షల ఎకరాలు సాగవుతది. దీంతో పాటు హైదరాబాద్‌కు తాగునీళ్లు, పరిశ్రమలకు నీళ్లిస్తుంది. ఇప్పుడు కాదు, రెండుమూడేండ్లు వర్షాలు పడకపోతే అప్పుడు తెలుస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం.
కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మేదావులు, జర్నలిజం ముసుగులో ఉన్న కొందరు గుజరాతీ బానిసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నరు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల దాన్ని నిజం చెయ్యాలనుకుంటున్నరు. కానీ.. అది ఎప్పటికీ నిజం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏదో నాలుగు లిఫ్టులు, మూడు బ్యారేజీలు కాదు. కాళేశ్వరం అంటే తెలంగాణ జీవనాడి. దాని మీద తప్పుడు ప్రచారం చేసి, బురద చల్లే ప్రయత్నం చేయడమంటే.. తెలంగాణ జాతికి ద్రోహం తలపెట్టినట్లే.
-శంకర్, జర్నలిస్టు, 99661 07880