హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పాలకపక్షం తీరు ‘బట్టకాల్చి మీదెయ్యాలె.. బద్నాం చెయ్యాలె’ అన్నట్టుగా ఉన్నది. తప్పు చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షంపైకి నెపం నెడుతూ తాము చేసింది కరెక్టేనని నిరూపించేందుకు ఎంతకైనా తెగిస్తున్నది. ఇందుకు అసెంబ్లీ వేదికగా శుక్రవారం జరిగిన రెండు ఘటనలే తార్కాణంగా నిలుస్తున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు కొందరు దౌర్జన్యానికి దిగడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య ఆవేశానికి లోనై పేపర్ ఉండను బీఆర్ఎస్ సభ్యులపైకి విసిరారు. వీర్లపల్లి శంకరయ్య తమపై వాటర్‌బాటిల్ విసిరాడని, చెప్పుచూపాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు మాత్రం అ దేంలేదని తాము నిబంధనల మేరకే నడుచుకున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం గా ని, అసెంబ్లీ గాని ఎలాంటి వీడియోలను బ యటపెట్టలేదు. తమపైకి చెప్పుతీశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించిన తర్వా త ఆయా వీడియోలను బయటికి ఇవ్వాల్సి ఉండగా అలాంటి ప్రయత్నమేదీ ప్రభు త్వం వైపు నుంచి జరగలేదు.
ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది?
ఈ కార్ రేసింగ్‌పై చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేస్తున్న వీడియోలు ఓ మీడియా చానల్లో ప్రసారమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బద్నాం చేయడమే లక్ష్యంగా హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆందోళన చేస్తున్న వీడియోలు బయటకొచ్చాయి. వాస్తవంగా వీటిని అసెంబ్లీ సిబ్బంది ప్రసారం చేయలేదు. కానీ, కుట్రపూరితంగా ప్రభుత్వ వర్గాలే ఆయా వీడియోను రికార్డు ఉన్న పెన్‌డ్రైవ్‌ను ఓ టీవీ చానల్‌కు అందించినట్టు విమర్శలు వస్తున్నాయి. అదికూడా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా ఎడిట్చేసి చానల్‌కు అందించగా అది ప్రసారమమైంది. మిగతా చానళ్ల రిపోర్టర్లు ఇదే విషయాన్ని సీఎంవో పీఆర్వోను అడిగితే తాము ఇవ్వలేదని, గ్యాలరీ నుంచి ఎవరో రికార్డుచేశారని చెప్పారు. వాస్తవానికి అసెంబ్లీ గ్యాలరీలోకి ఫోన్లను అనుమతించరు. మరీ ఫోన్లు ఎవరు తీసుకెళ్లారు అన్నది మిలియన డాలర్ల ప్రశ్న.