ములుగు, డిసెంబర్ 26 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో పర్యాటక రంగానికి పెట్టింది పేరుగా నిలిచిన ములుగు జిల్లాలో మరో అద్భుత పర్యాటక ప్రాంతం రూపుదిద్దుకుంటున్నది. ఇది త్వరలో అందుబాటలోకి రానున్నది. తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతం మధ్యలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ టూరిజంలో భాగంగా బ్లాక్ బెర్రీ ఐలాండ్లను ఏర్పాటు చేశారు. ఈ ఐలాండ్లు పూర్తిగా ఇసుక మేటలపై నిర్మించారు. పర్యాటకులు విడిది చేసేందుకు అధునాతనమైన 50 గుడారాలను సిద్ధం చేశారు. రాత్రి సమయంలో బస చేసే పర్యాటకుల కోసం క్యాంపు ఫైర్ ఏర్పాటుచేశారు. వాగు మధ్యలో ఇసుక మేటలపై 5 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేశారు. బీచ్ వాలీబాల్ తరహా ఆడేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.