హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారై వరుస ప్రమాదాలు జరుగుతున్నా సర్కారు మొద్దునిద్ర వీడడంలేదు. మరమ్మతులకు కూడా చేయించడంలేదు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించిన అధికారులు వాటిని కూడా గాలికి వదిలేశారు. దీంతో రోడ్డెక్కిన ప్రజలు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడలో ప్రమాదం జరిగిన ప్రాంతం కూడా బ్లాక్‌స్పాట్‌గా గుర్తించిన జాబితాలో ఉండటం గమనార్హం. ఒకవేళ అక్కడ మరమ్మతులు చేపట్టి ఉంటే ఘోర ప్రమాదం జరగకపోయేదని స్థానికులు చెప్తున్నారు. ఇటీవలి భారీ వర్షాలకు ఆర్అండ్బీ పరిధిలో సుమారు 1500 కిలో మీటర్లమేర రోడ్లు, 200 కల్వర్టులు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. వీటి శాశ్వత పునరుద్ధరణకు దాదాపు రూ.1400కోట్లు, తాత్కాలిక మరమ్మతులకు రూ. 150కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం మాత్రం అత్యవసరం అనుకున్న పనులకు వివిధ దశల్లో రూ.60 కోట్ల వరకూ నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నది. పాత బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండడంవల్ల పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు.
నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చేవెళ్లలో జరిగిన ప్రమాదాన్ని పరిశీలిస్తే, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ), ఆర్అండ్బీ శాఖల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రమాదానికి రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉండడం కూడా ప్రధాన కారణమని అక్కడి పరిస్థితినిబట్టి అర్థమవుతున్నది. ప్రమాదం జరిగిన ప్రాంతం బ్లాక్‌స్పాట్‌గా గుర్తించి రెండేండ్లయినా సరిచేసేందుకు ఎన్హెచ్ఏఐ గానీ, రాష్ట్ర సర్కారు గానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ రహదారులపై 930 ప్రాంతాలను ప్రమాదకర లొకేషన్లు (బ్లాక్‌స్పాట్స్)గా గుర్తించారు. ఇందులో 640 లొకేషన్లు జాతీయ రహదారులపై ఉండగా, 290 రాష్ట్ర రహదారులపై ఉన్నాయి. హైదరాదాబాద్, పరిసర ప్రాంతాల్లో 54 బ్లాక్స్పాట్లు ఉన్నాయి. ఇందులో ఎన్‌హెచ్-65 హైదరాబాద్-సూర్యాపేట, నిజామాబాద్-జగ్దల్పూర్, నెహ్రూ ఔటర్ రింగురోడ్డు, హైదరాబాద్-బీజాపూర్ హైవే(చేవెళ్ల ప్రాంతం కూడా ఇందులో భాగం). ముఖ్యంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఇరుకు రోడ్డు, అధిక ట్రాఫిక్, రోడ్డుపై మితిమీరిన గుంతలు, రోడ్ల నిర్వహణ లోపంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. 100 స్పాట్లలో అరకొర పనులు చేసి, చేతులు దులుపుకున్నారు.
రోడ్డుపై కనీసం 500 మీటర్లమేర తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే ఆ లొకేషన్‌ను ఇంజినీరింగ్ పరిభాషలో బ్లాక్‌స్పాట్‌గా పరిగణిస్తారు. ప్రమాదాలకు డిజైన్ లోపం, షార్ప్ కర్వ్స్, జంక్షన్లు, రోడ్డు పైపొర సరిగా లేకపోవడం తదితర కారణాలు ప్రధానమైనవిగా గుర్తిస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని సరిచేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయడంలేదు. పోలీసు రికార్డుల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 70 శాతం, అంటే 7,333 రోడ్డు ప్రమాదాలు బ్లాక్స్పాట్ల వద్ద సంభవించాయి. ఈ ప్రమాదాల్లో సుమారు 2,702 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం గనుక బ్లాక్స్పాట్లలో మరమ్మతులు చేసి ఉంటే… ఇన్ని మరణాలు సంభవించేవి కాదనేది స్పష్టమవుతున్నది.