కల్వకుర్తి, జనవరి 9 : వంద శాతం రుణమఫీ చేశామని ఊకదంపుడు ప్రకటనలతో రైతులను అయోమయానికి గురిచేస్తున్న ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలు తప్పని నిరూపిస్తూ స్వయంగా అధికార పార్టీకి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు. వనపర్తి జిల్లాలో వివిధ అభివృధ్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భట్టి కల్వకుర్తికి రాగా బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యం లో రైతులకు రుణమాఫీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని విన్నవించారు.
గ్రామాల్లో 50 శాతానికిపైగా రైతులకు రుణమాఫీ కాకపోవడంతో గ్రామాలలో ఉండే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్కలా మారింది. స్థా నిక సంస్థల ఎన్నికల్లో తీవ్రస్థాయిలో అవమానకరరీతిలో పరాజయం తప్పదనే భయంలో అధికార పార్టీ నాయకులు అల్లాడుతున్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయిందనే విషయం రైతులందరికీ అర్థమవుతోందని నాయకులు అంటున్నారు.