హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల ప్రచార ప్రారంభ సభలోనే బీజేపీ తుస్సుమంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నితిన్ నబీన్ తొలిసారి రాష్ట్ర పర్యటనకు రావడం, ఆయన ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలు కూడా ఇవే కావడంతో సభ నిర్వహణపై పార్టీ శ్రేణులు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. కానీ, బుధవారం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ‘విజయ సంకల్ప్ సమ్మేళనం’ సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. సభలో ఏర్పాటుచేసిన ఖర్చీల్లో 60% ఖాళీగా దర్శనమిచ్చాయి. పార్టీ కొత్త బాస్ నితిన్ నబీన్ స్వయంగా ఈ సభకు హాజరైనా, రాష్ర్టానికి చెందిన ముఖ్య నేతలు ముఖం చాటేయడం చర్చనీయాంశంగా మారింది.
జాతీయ అధ్యక్షుడి సభను భుజానికెత్తుకుని విజయవంతం చేయాల్సిన నేతలంతా తలోదారి అన్న చందంగా వ్యవహరించడంతో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బహిర్గతమైనట్టయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు, మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ సభకు హాజరుకాలేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ మాత్రమే సభకు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాత్రమే స్టే జీపై కనిపించారు. మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో తాము హాజరుకాలేదని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్తున్నా.. వాస్తవానికి అంతర్గత కుమ్ములాటలే ప్ర ధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ర్టానికి తొలిసారి వచ్చిన నితిన్ నబీన్‌కు స్వాగతం పలికేందుకు కూడా రాష్ట్ర నేతలు ఎవరూ రాకపోవడం
గమనార్హం.