హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హైడ్రా పేరిట డ్రామాలకు తెరలేపిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పేరుతో పేదల ఇండ్లు, గుడిసెలను కూల్చుతున్న సరారుకు.. పెద్దల ఇండ్లు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మూసీ బెల్ట్‌లో ఇండ్లను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయగా, ధర్నాకు దిగిన బాధితులను బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం పరామర్శించారు. అనంతరం మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ ఒడ్డున ఎఫ్టీఎల్ అని తెలియక ఎంతోమంది పేదలు అక్కడ స్థలాలను కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నారని, ఇప్పుడు వాటిని కూల్చివేయడం ఎంతవరకు కరెక్ట్ అని మండిపడ్డారు. సీఎం సోదరుడి ఇంటిని ఎందుకు కూల్చడం లేదని నిలదీశారు. కూల్చివేతలను ఆపకపోతే బీజేపీ తరఫున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.