ఖిలావరంగల్, ఆగస్టు 1: మద్యం మత్తులో బీజేపీ నాయకులు హల్చల్ చేశారు. నిర్మాణంలో ఉన్న బస్తీ దవాఖాన వాష్ రూంను అందరు చూస్తుండగానే ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసినవారిపై కూడా రెచ్చిపోయారు. భవన నిర్మాణానికి సంబంధించిన పనిముట్లను ఎత్తుకెళ్తారు. ఈ ఘటన సోమవారం గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్లోని గిరిప్రసాద్‌నగర్‌లో చోటుచేసుకున్నది.
గిరిప్రసాద్‌నగర్‌లో బస్తీ దవాఖాన మంజూరైంది. భవన నిర్మాణం ఆలస్యమవుతుందని భావించిన కాలనీవాసులు.. కమ్యూనిటీ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌ను బస్తీ దవాఖానకు ఇచ్చేలా తీర్మానం చేసి అప్పగించారు. ప్రభుత్వం రూ.12 లక్షలు కేటాయించింది. మెడికల్ ఆఫీసర్‌కు ఒక గది, ల్యాబ్‌కు ఒక గది, స్టోర్ రూం, మరోగదిని సిద్ధం చేశారు.
అయితే దవాఖానకు ఆనుకొని ఉన్న ప్రభుత్వస్థలంలో రోగుల కోసం వాష్ రూమ్‌ల నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మద్యం తాగి నిర్మాణంలో ఉన్న వాష్‌రూంను కూల్చివేశారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే బీజేపీ కార్యకర్తలు పరారయ్యారు. దేవులపల్లి శ్రీనాథ్, పూర్ణ, సంపత్, నరేశ్, రాజుతోపాటు మరి కొంతమంది వాష్ రూంను కూల్చి వేశారని కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.