కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని బేరానికి పెట్టిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. రూ.6 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని.. ఇకపై గాలిని, నీటిని కూడా అమ్ముతారేమోనని ఎద్దేవాచేశారు. పీఆర్టీయూ, అంగన్వాడీల ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నిర్వహించిన కృతజ్ఞతా సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదేండ్ల్లకు కలిపి కేవలం 15 శాతం ఫిట్మెంట్ ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం ఐదేండ్లకే 30 శాతం అమలుచేసిందని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తున్నదని, పనిచేసే ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా నిలువాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.6లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. దేశంలో ఇక మిగిలేది గాలి, నీరేనని.. అవకాశం ఉంటే వాటిని కూడా అమ్మకానికి పెడతారేమోనని ఎద్దేవాచేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పీఆర్టీయూ ఉపాధ్యాయుల సంఘం, అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తే, కేంద్రం పదేండ్లకు కలిపి కేవలం 15 శాతం మాత్రమే ఇచ్చిందని గుర్తుచేశారు. అంటే కేంద్రం ఐదేండ్ల కలిపి ఇచ్చిన ఫిట్మెంట్ 7.5 శాతం మాత్రమేనని తెలిపారు. అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారని, ఒకసారి 43 శాతం, మరోసారి 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిధులు వెచ్చించడం లేదని కొందరు ద్రుష్పచారం చేస్తున్నారని.. కానీ, విద్య కోసం అనేక శాఖలకు బడ్జెట్‌ను కేటాయించి వాటి ద్వారానే ఖర్చు చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో 50 నుంచి 60 వేల ఉద్యోగ ఖాళీలను గుర్తించామని, త్వరలోనే భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
అంగన్వాడీలకు కేంద్రం ఇస్తున్నదెంత?
గతంలో ఎన్నో పోరాటాలు చేస్తే అప్పటి ప్రభుత్వాలు అంగన్వాడీలకు రూ.500 నుంచి రూ.600 వేతనం మాత్రమే పెంచేవని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అడగకముందే మూడుసార్లు పెంచిందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీలకు రూ. 13,650 వేతనం ఇస్తున్నామని వెల్లడించారు. ఇందులో కేంద్రం ఇస్తున్నది కేవలం రూ.2,700 మాత్రమేనని చెప్పారు. గుజరాత్లో అంగన్వాడీలకు రూ. 7,800, ఆయాలకు రూ.3,950 మాత్రమే ఇస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. మంత్రి గం గుల కమలాకర్ మాట్లాడుతూ.. అంగన్వాడీలు సామాజిక సేవకులని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, బేవరే జెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు.
హుజూరాబాద్ రూరల్: మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లో మంత్రి సమక్షంలో వీణవంక మండలం కిష్టంపేట బీజేపీ అధ్యక్షుడు మాదాసు వెంకన్న, ఉపాధ్యక్షుడు రమేశ్, పాల ఉత్పత్తి సహకార సంఘం అధ్యక్షుడు ఆకుల నర్సయ్య, హమాలీ సంఘం అధ్యక్షుడు తీగల రవితోపాటు మరో 20 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు.