దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 10-12 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారిపోతాయని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం మాట్లాడుతూ.. తెలంగాణకు సహకరించని బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లను అడుగుతున్నారని ప్రశ్నించారు. పేదలకు మేలు చేయని మోదీ ప్రభుత్వం.. అంబానీ, అదానీలకు రూ.15 లక్షల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. బీజేపీ మత విద్వేషాలతో యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయోధ్య రామమందిరం తప్ప బీజేపీకి ఏ ఎజెండా లేదన్నారు. పదేండ్ల క్రితం గద్దెనెక్కిన మోదీ చేసిందేమీ లేకపోగా, మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు సిద్దంగా ఉన్నారని పోచారం తెలిపారు. అలాగే, రాజ్యాంగాన్ని సైతం తిరగ రాస్తామని బీజేపీ నేతలు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొదటి స్థానంలో నిలుస్తుందని పోచారం స్పష్టం చేశారు. బీజేపీకి రెండో స్థానం, కాంగ్రెస్కు మూడో స్థానమే దక్కుతుందన్నారు. ఈ విషయం కాంగ్రెస్ చేయించిన సర్వేలోనే తేలిందని చెప్పారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకుండా కేసీఆర్, బీఆర్ఎస్ను తిట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. మార్పు కోరుకున్న ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని, కేసీఆర్ పాలనే బాగుండేదని గుర్తు చేసుకుంటున్నారన్నారు.