యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో మూడో స్థానానికే పరిమితం అవుతుండటంతో బీజేపీ నీచ రాజకీయాలకు తెరలేపింది. టీఆర్ఎస్ను ఢీకొనలేక కుళ్లు, కుతంత్రాలు షురూచేసింది. ప్రతి ఎన్నికల మాదిరిగానే ఈసారీ పాత అజెండాను అమలు చేస్తున్నది. విద్వేషపు ప్రసంగాలతో ఓటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ ఓట్లు దండుకునే దుర్బుద్ధి ప్రదర్శిస్తున్నది. పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఓటర్లను గందరగోళ పరచాలని చూస్తున్నది. అసలు ఉప ఎన్నికలో గెలిస్తే ఏం చేస్తామో చెప్పకుండా.. ఇప్పటి దాకా ఏం అభివృద్ధి చేశామో వివరించకుండా డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్లే చేస్తున్నది. ఇవేం రాజకీయాలు అంటూ మునుగోడు ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు.
సర్జికల్ స్ట్రైక్స్..సెంటిమెంట్ పేరుతో..
బీజేపీ అంటేనే జనాలను రెచ్చగొట్టే పార్టీగా, కాంట్రవర్సీ కామెంట్స్‌తో పబ్బం గడుపుకొనేదిగా పేరొందింది. మత విద్వేషాలు, వైషమ్యాలు సృష్టించి లబ్ధి పొందుతుందనేది జగమెరిగిన సత్యం. మునుగోడులోనూ ఇదే తంతు కొనసాగిస్తున్నది. ఇందులో బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్, కిషన్‌రెడ్డి, అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో సర్జికల్ ైస్ట్రెక్ను అస్త్రంగా వాడుతున్నారు. మునుగోడు ఎన్నికలకు సంబంధం లేని పాక్-ఇండియా మ్యాచ్‌ను కూడా చొప్పిస్తున్నారు. ఉగ్రవాదంపై కావాలనే ప్రసంగాలు చేస్తూ ఒక వర్గంపై వైషమ్యాలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రతిసారీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఎదుట ప్రమాణం చేద్దామంటూ సవాల్ చేయడం పరిపాటిగా మారింది.
ఏం చేస్తరో చెప్పలేకే..
సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీలు, అభ్యర్థులు అభివృద్ధిపై ఫోకస్ పెడుతాయి. ఎన్నికలో తాము గెలిస్తే ఏం చేస్తామో వివరించే ప్రయత్నం చేస్తాయి. ఇప్పటి దాకా ఏం చేశాయో కూడా చెప్పుకొంటాయి. కానీ, మునుగోడులో మాత్రం బీజేపీ ఇవేవీ చెప్పడంలేదు. యువత, మహిళలు, రైతులు, నిరుద్యోగులకు ఎలాంటి హామీ ఇవ్వడంలేదు. అసలు ఆ ముచ్చటే ఎత్తడంలేదు. సెంటిమెంట్ రాజకీయాలు, రెచ్చగొట్టే మాటలు, అబద్ధపు ముచ్చట్లు మాత్రమే వల్లిస్తున్నది. ప్రచారానికి వచ్చిన జనం సైతం ఇవేం బుద్ధులు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో దూరం నుంచి సమావేశానికి వస్తే మాకిదేం ఖర్మ అని నిట్టూరుస్తున్నారు.
అన్నీ అబద్ధాలే..
ఉప పోరులో బీజేపీ నాయకులు అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. ఉన్నవి, లేనివి చెప్తూ జనాన్ని
తికమకపెడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి పనిలో కేంద్రం వాటా ఉన్నదంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, శ్మశాన వాటికలు, హరితహారం తదితర పథకాలన్నీ కేంద్రం సాయంతోనే నడుస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. తెలంగాణలో కీలక పథకాలైన రైతు బంధు, ఆసరా, దళితబంధు,కల్యాణలక్ష్మీ, రైతు బీమా పథకాలపై మాత్రం నోరు మెదపట్లేదు. బీజేపీ సోషల్ మీడియా సైతం తెలంగాణపై, టీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉన్నాయని, సదరు వ్యక్తుల పేర్లు, ఫొటోలతో సహ ప్రచారం చేస్తున్నది.