ముషీరాబాద్, నవంబర్ 14: మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన వర్గీకరణ డిమాండ్‌ను పదేండ్లుగా పట్టించుకోని బీజేపీ.. ఎన్నికల్లో లబ్ధి కోసమే టాస్క్‌ఫోర్స్ కమిటీ అంటూ కొత్త నాటకానికి తెరలేపిందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. ప్రధాని మోదీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెడతారో చెప్పకుండా మళ్లీ కమిటీ అంటూ మాదిగలను మరోమారు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని, మందకృష్ణలది ధృతరాష్ట్ర కౌగిలి అని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ మంద కృష్ణ ఓట్లు అమ్ముకోవడం మానుకోవాలని హితవు పలికారు. మంగళవారం హైదరాబాద్ విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో వంగపల్లి మాట్లాడారు. 2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందని గుర్తుచేశారు.
కానీ పదేండ్లుగా వర్గీకరణ ఊసెత్తలేదని ఆగ్రహించారు. బీజేపీ నాయకులకు, ప్రధానికి ఎన్నికల వేళ వర్గీకరణ ఏ రాజకీయ లబ్ధి కోసం గుర్తుకువచ్చిందో మాదిగలు అర్థం చేసుకున్నారని స్పష్టంచేశారు. ప్రధానికి వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎప్పటిలోగా కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది? ఎప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బిల్లు విషయంలో స్పష్టత ఇవ్వకుండా టాస్క్‌ఫోర్స్ కమిటీ అంటూ ప్రకటించడం మాదిగలను మోసం చేయడమేనని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపినా పదేండ్లుగా పట్టించుకోని బీజేపీకి మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం మాదిగలకు చేసింది ఏమీలేదని, మోదీ పాలనలో అత్యాచారాలు, దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. బాబ్రీ మసీదు, 370 ఆర్టికల్, ట్రిపుల్ తలాక్, జీఎస్టీ వంటి కీలక సమస్యలను పరిష్కరించిన బీజేపీ.. కావాలనే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తొక్కిపెట్టిందని మండిపడ్డారు. మంద కృష్ణ మాదిగ మొసలి కన్నీళ్లు కారిస్తే మాదిగలు నమ్మరని దుయ్యబట్టారు.