హైదరాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ)/మిర్యాలగూడ/దామరచర్ల: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులను పట్టించుకొనే దిక్కేలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన పంటలను నూటికి నూరు శాతం మద్దతు ధరకు కొనుగోలు చేసింది దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రతి పథకాన్నీ విమర్శిస్తున్న బీజేపీ నాయకులు.. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతులకు ఉచిత కరెం టు, రైతుబీమా, మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి అత్యధికంగా ఎంపీలను ఇచ్చిన ఉత్తరప్రదేశ్‌లో రైతులు నేటికీ ఆయిల్ ఇంజిన్లతో వ్యవసాయం చేసుకుంటున్నారని చెప్పారు. గుజరాత్లో వ్యవసాయ మోటర్ల కు బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మించిన రైతు వేదిక భవనాలను శనివారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. కేంద్రం వ్యవసాయాన్ని ప్రైవేటుపరం చేస్తూ అనేక కొత్త చట్టాలను తెస్తుందని, చట్టంలో పంటలకు మద్దతు ధర విషయం చేర్చకపోవడంతో పంచాయితీ మొదలైందని తెలిపారు. రాష్ర్టానికి నిధులు సాధించడంలో శ్రద్ధ చూపని బీజేపీ నాయకులకు తెలంగాణలో మాట్లాడే అర్హత లేదన్నారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పంట మీదే.. ధర మీదే
‘మీ పంటకు.. మీరే ధర నిర్ణయించే స్థాయికి రావాలి’ అని మంత్రి నిరంజన్‌రెడ్డి రైతులకు సూచించారు. ఇందుకు రైతు వేదికలను వినియోగించుకోవాలన్నారు. ఈ ఏడాది అత్యధికంగా వరి దిగుబడిని సాధించిన తెలంగాణ రాష్ట్ర రైతాంగం దేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు. అంతకుముందు మిర్యాలగూడలో దళితబంధు పథకాన్ని హర్షిస్తూ దళితులతో కలిసి సీఎం ఫ్లెక్సీకి మంత్రి క్షీరాభిషేకం చేశారు.