హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ‘ఓటమి తప్పదని తెలిసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీచేశాం. ఎన్నికలైనందున గతంలో మాదిరిగానే పనితీరును ప్రదర్శించాం’ అని ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. యుద్ధంలోకి దిగినప్పుడు ప్రయత్నం చేస్తాం కదా.. అంటూ నిర్వేదంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగంతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. ఇక్కడ అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.