హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులకు రాజకీయ ప్రయోజనాలు తప్ప, బీసీల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టిన కులగణన రాజ్యాంగబద్ధంగా జరగలేదని ఆరోపించారు. కులగణన వివరాలను ప్రభుత్వం బయటపెట్టకపోవడంపై అనుమానాలున్నాయని చెప్పారు. మతపరంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ చేస్తున్న కుట్రను బీజేపీ వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్లో తలపెట్టిన బీసీ సమ్మేళనానికి కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.