హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రమై రైతులు అల్లాడుతుంటే కాంగ్రెస్, బీజేపీ కలిసి పరస్పర నిందలతో పబ్బం గడుపుకొంటున్నాయి. తెల్లవారు జామునుంచే ఎరువుల కోసం అన్నదాతలు ఆగ్రో కేంద్రాల వద్ద కిలోమీటర్ల కొద్దీ బారులు తీరి తిండీతిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నా ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ సర్కారు దొంగ డ్రామాలు ఆడుతూ రైతుల ప్రయోజనాలను పణంగా పెడుతున్నాయి. అదును దాటుతున్నా యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఆ రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అసలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా పంపాల్సిన బాధ్యతను మరిచి కేంద్రంలోని బీజేపీ సర్కారు, తెప్పించుకోవాల్సిన బాధ్యతను మరిచి రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి.
రైతులను ముంచుతున్న జాతీయ పార్టీలు
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచీ రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేసింది. వ్యవసాయానికి అదునుకు నీళ్లివ్వకపోవడమే కాకుండా యూరియా కూడా తెప్పించకుండా రైతులను గోస పెడుతున్నది. కేంద్రమే యూరియా పంపడం లేదని నెపం నెట్టి చోద్యం చూస్తున్నది. మరోవైపు దేశ మొత్తంలో ఎక్కడా యూరియా కొరత లేదని బీజేపీ డబ్బా కొట్టుకుంటున్నది. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులే దళారులుగా మారి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నది. రెండు ప్రభుత్వాలు కలిసి ఒకదానిపై ఒకటి నెపం నెట్టుకుంటూ అన్నదాతలను నిండా ముంచుతున్నాయి.
తుమ్మలకు సవాల్
రైతుల ప్రయోజనాలు పక్కన నెట్టి రాజకీయాల కోసం ఆ పార్టీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా యూరియా కొరతపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, మంత్రి తుమ్మల పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ యూరియా కొరత లేదని, అలాంటప్పుడు తెలంగాణలో కొరత ఎందుకు ఉన్నదని రామచందర్‌రావు ప్రశ్నించారు. గురువారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ నిరుడుకన్నా ఎక్కువ యూరియాను కేంద్రం ఇచ్చినట్టు తెలిపారు. యూరియా కృత్రిమ కొరతపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులే దళారులుగా మారి యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియాను బ్లాక్ చేసి దందా సాగిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణకు సరిపోయేంత కోటా ఇచ్చామని.. ఇందుకు సంబంధించి తన దగ్గర పూర్తి లెక్కలు, ఆధారాలు ఉన్నాయని, దమ్ముంటే తుమ్మలకు చర్చకు రావాలని రామచందర్ రావు సవాల్ విసిరారు.
నాడు ముందే తెప్పించిన కేసీఆర్
ఎరువుల కొరత పరిష్కారం కోసం నాడు కేసీఆర్ తన చతురతను ప్రదర్శించారు. దేశంలో ఇతర రాష్ర్టాలకు ఎరువులు అవసరంలేని సమయంలో కేంద్రాన్ని, ఎరువుల కంపెనీలను ఒప్పించి రాష్ర్టానికి కావాల్సిన ఎరువులను ముందుగానే కొనుగోలు చేసేవారు. ఏప్రిల్, మే నెలల్లో ఇతర రాష్ర్టాలు ఎక్కువగా ఎరువులను తీసుకోవు. ఇదే అదునుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కంపెనీల నుంచి ఎరువులను కొనుగోలుచేసేది. ఇందుకోసం ప్రతి సీజన్లో సుమారు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల వరకు ముందుగానే నిధులు విడుదల చేసి ఎరువులు కొనేది. దీంతో వానకాలానికి అవసరమైన ఎరువులు రెండు నెలల ముందే రాష్ర్టానికి చేరేవి. వర్షాలు కురిసే సమయానికి రైతులకు అందుబాటులో ఉండేవి. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నాడు రాష్ట్రంలో ఎరువుల సరఫరా, నిల్వలపై నిరంతరం పర్యవేక్షించేవారు. అవసరమైన నిల్వలో ఏమాత్రం తక్కువ అనిపించినా వెంటనే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపి కేంద్ర మంత్రులతో మంతనాలు జరిపి తెప్పించేవారు. సీజన్ మధ్యలో కొరత ఏర్పడినా మళ్లీ ఏకంగా ఉన్నతాధికారులనే ఢిల్లీకి పంపి, కేంద్ర అధికారులతో స్వయంగా మాట్లాడి తెలంగాణకు అవసరమైన ఎరువులను తెప్పించేవారు.
మీ విజ్ఞతకే వదిలేస్తున్న : తుమ్మల
రాంచందర్‌రావు వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్పందిస్తూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ యూరియా కొరత లేదని చెప్పడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేంద్రం కొన్ని రాష్ర్టాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని విమర్శించారు. రైతుల పట్ల కేంద్రం కర్కషంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. సీబీఐ ఎంక్వైరీ అని రామచందర్‌రావు మాట్లాడుతున్నారని, సీబీఐ కాకుంటే మరేదైనా విచారణ సంస్థతో ఎంక్వైరీ చేయించుకోవాలని ప్రతి సవాల్ చేశారు.