హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ దోపిడీకి తెలంగాణ అక్షయపాత్రగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రెస్ సభ నిర్వహించిందని మండిపడ్డారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేసి.. ఎస్సీ, ఎస్టీలకు సంకెళ్లు వేసి భీమ్ పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలకు తూట్లు పొడిచి కాంగ్రెస్ రాజ్యాంగ విలువలను ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. తొలుత పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం ర్యాలీగా గన్‌పార్క్ వెళ్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.