కామారెడ్డి, డిసెంబర్ 3: ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గౌరవిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు. గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశమై, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని పేర్కొన్నారు. తమ పార్టీ కీలక నేతలు ఓడిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద విజయం దక్కిందని, ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలని సూచించారు.
పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించామని, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్‌గా భావిస్తున్నట్టు చెప్పారు. 3 రాష్ర్టాల్లో బీజేపీ గెలవటం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కామారెడ్డి నుంచి ఎమ్మెల్యే గెలుపొందిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.