Kishan Reddy | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : మాజీప్రధాని మన్మోహన్సింగ్ మరణంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, ఆమె కుటుంబం, ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఈ వైఖరి కాంగ్రెస్ సంసారహీనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ మరణించినట్టు తెలియగానే మాజీప్రధాని వాజ్‌పేయికి నిర్వహించినట్టుగానే అంతిమ సంసారాలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రమంత్రి అమిత్‌షా నేతృత్వంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి.
మన్మోహన్ స్మారక కేంద్రం, ఓ ట్రస్టు ఏర్పాటు చేయడం గురించి కూడా మన్మోహన్ సతీమణితో అమిత్‌షా మాట్లాడారు అని వెల్లడించారు. మన్మోహన్సింగ్ అంతిమ సంస్కారాల విషయంలో నరేంద్రమోదీ ప్రభుత్వం నిబంధనలు పాటించిందని తెలిపారు. ఇటీవల ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం, బోర్లాపడడం రాహుల్‌కు అలవాటైందని ఎద్దేవాచేశారు. రాహుల్‌ది అహంకారపూరిత, దివాలాకోరుతనమని ధ్వజమెత్తారు. మాజీప్రధాని పీవీ నరసింహారావు, మాజీరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణించినప్పుడు అవమానకరంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన్మోహన్సింగ్ విషయంలో మొసలికన్నీరు కారుస్తున్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు రాజకీయం కోసం మన్మోహన్పై దొంగప్రేమను ఒలకబోస్తున్నారని మండిపడ్డారు.
రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన పనులు దాదాపు మూడేండ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమయ్యాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఉత్తరభాగం భూసేకరణ దాదాపు పూర్తయిందని చెప్పారు. భూసేకరణ అక్కడక్కడ కొంత మిగిలిపోయిందని, ప్రస్తుత ప్రభుత్వం సహకరించి పూర్తి చేయాలని కోరారు.