హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తప్పును కప్పిపుచ్చేందుకు బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపిందని తెలంగాణ రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శించారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టును బీజేపీ ఇచ్చిందని, అందుకే ఆ పార్టీలో చేరినట్టు రాజగోపాల్‌రెడ్డే స్వయంగా తెలిపారని, అందుకే డిపాజిట్ వచ్చే పరిస్థితి కూడా లేదని కమలం నేతలకు భయం పట్టుకున్నదని అన్నారు. రాజగోపాల్‌రెడ్డి తీరుపై మునుగోడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ప్రస్తుతం ఆయన మాటలు విన్నాక అసలు బీజేపీకి ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారని తెలిపారు. అందుకే ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు తాంత్రిక పూజలంటూ బీజేపీ కొత్త నాటకం మొదలుపెట్టిందని ఆరోపించారు. మునుగోడులో కనీసం మూడో స్థానాన్నైనా దక్కించుకొని, పరువు కాపాడుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజల చేతుల్లో చెప్పు దెబ్బలు తప్పవని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. బండి, నిర్మల వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.