హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తప్పుడు ప్రచారంతో బీజేపీ మరోసారి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నది. కేసీఆర్ బీహార్ పర్యటనపై ఫేక్ ప్రచారం చేస్తున్నది. ప్రెస్మీట్లో కేసీఆర్ మాట్లాడుతుండగా.. నితీశ్ లేచి నిలబడటం, కేసీఆర్ ఆయనను కూర్చోవాలని చెప్పిన వీడియోతో నీతిబాహ్య ప్రచారం చేస్తున్నది.
అసలేం జరిగింది?
బీహార్ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ నితీశ్‌తో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ అనుకూల మీడియా ప్రతినిధులు కొందరు ఇబ్బందికరమైన ప్రశ్నలేశారు. ‘ఫ్రంట్ ఏర్పాటు చేస్తే నితీశ్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారా?’ అని ప్రశ్నించగా.. నితీశ్ కొట్టిపారేశారు. పదే పదే అదే ప్రశ్న అడగడంతో ‘ఇక ప్రశ్నలు చాలు.. ధన్యవాదాలు’ అంటూ నితీశ్ లేచి నిలబడ్డారు. కానీ, సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ‘ఫ్రంట్ గురించి ఎక్కడా అనలేదు. బీజేపీ ముక్త్ భారత్ కోసం మాతో కలిసివచ్చేవారితో చర్చిస్తున్నాం. ఏ నిర్ణయమైనా విస్తృతంగా చర్చించిన తర్వాతే సమిష్టిగా ప్రకటిస్తాం’ అని సూటిగా చెప్పారు. బీజేపీ అనుకూల మీడియా ప్రతినిధులు అడ్డగోలు ప్రశ్నలు అడిగినా.. ‘ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తా. తొం దరపడకండి.. ఇక్కడే కూర్చున్నా’ అని కేసీఆర్ సమాధానమిచ్చారు. వాస్తవాన్ని కప్పిపెట్టి బీజేపీ అడ్డగోలు ప్రచారం చేస్తున్నది.
పాట్నా జర్నలిస్టులు ఫిదా
బీజేపీ వాట్సాప్ వర్సిటీ ఫేకుడు గాళ్ల రాతలెలా ఉన్నా.. కేసీఆర్ హిందీ ప్రసంగానికి పాట్నా జర్నలిస్టులు ఫిదా అయ్యారు. ఒక పరాయి రాష్ట్ర నేత, అందులోనూ హిందీయేతర రాష్ట్ర నాయకుడు దాదాపు 60 నిమిషాల పాటు హిందీలో అనర్గళంగా మీడియా సమావేశంలో మాట్లాడటం స్థానిక పాత్రికేయులను ఆశ్చర్యపర్చింది. బీహార్ చరిత్రలోనే ఇది తొలిసారి అని పలువురు వ్యాఖ్యానించారు. ఎన్ని ప్రశ్నలు సంధించినా.. ఎంతో సంయమనంతో, సావధానంగా అన్నింటికీ జవాబు చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రే వెళ్లిపోవటానికి సిద్ధపడినా.. కేసీఆర్ తడబడకుండా విలేకరుల ప్రశ్నలకు దీటుగా సమాధానాలు చెప్పడం గొప్ప అంశమని పాట్నాలోని జాతీయ మీడియా ప్రతినిధులు పేర్కొనడం విశేషం.