హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): అధికారం సంపాదించేందుకు బీజేపీ విపరీతంగా డబ్బు వెదజల్లుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల హకులను, అధికారాలను కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం హరిస్తున్నదని ధ్వజమెత్తారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో విపక్షాలు ఉమ్మడి అవగాహనకు రావాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. సీపీఐ నేతలు కే నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావుతో కలిసి హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో రాజా గురువారం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.
దేశ సంపద కార్పొరేట్ల చేతికి..
బీజేపీ పాలనలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నదని రాజా ఆందోళన వ్యక్తంచేశారు. జాతి సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని మండిపడ్డారు. సంక్షేమ రాజ్యంగా ఉన్న భారత్‌ను, బీజేపీ సర్కారు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థగా మార్చేసిందని విమర్శించారు. నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తెలంగాణలో దర్యాప్తు కొనసాగుతున్నట్టే ఇతర రాష్ర్టాల్లో కూడా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసారు. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ల జోక్యం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేసారు. దేశానికి బీజేపీ-ఆర్ఎస్ఎస్ రూపంలో రాబోతున్న ప్రమాదాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని సూచించారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష పార్టీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరో రెండేండ్లలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలు రాబోతున్నందున 10 లక్షల మందికి పార్టీ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల అంశంపై చర్చలు ఉంటాయని, అప్పటివరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. ప్రస్తుతం 20 స్థానాలపై దృష్టి సారించామని, 119 నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.