ఖిలావరంగల్, మే 30: రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీ య కళాతోరణాన్ని తొలగించాలన్న ప్ర భుత్వ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గురువా రం వరంగల్ జిల్లా ఖిలా వరంగల్లోని కీర్తి తోరణం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ.. కాకతీయ కళాతోరణం రాచరికపు ఆనవాళ్లు కాదని, ఓరుగల్లు రాజసమని, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్ర చిహ్నం నుంచి కీర్తితోరణం తొలగించేందుకు చేస్తున్న కుట్రను ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్, రత్నం సతీశ్షా, రాణాప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.