Y Satish Reddy | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం ఓ పెద్ద డ్రామా అని రెడ్కో చైర్మన్ వీ సతీశ్‌రెడ్డి విమర్శించారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ సంజయ్ అని.. తప్పించుకునేందుకు కొత్త వేషాలు వేస్తున్నాడని ఆరోపించారు. బండి సంజయ్ అరెస్టయిన రోజు రాత్రి ఫోన్ ఆయనతోనే ఉందని, తాను ఫోన్లో మాట్లాడానని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్మీట్లో చెప్పారన్నారు. అలాగే, అరెస్ట్ అయిన తర్వాత రోజు బండి సంజయ్‌తో తన ఫోన్లో మాట్లాడానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
బండి సంజయ్ జైలు నుంచి విడుదలైన సమయంలో అసలు ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారని.. ఫోన్లో ఏముందని అడుగుతున్నారంటూ పోలీసులపైనే ఆరోపణలు చేశారన్నారు. జైలు నుంచి విడుదలైన సమయంలో ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ మాట్లాడిన బండి సంజయ్ ఇవాళ తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద డ్రామా అన్నారు. నిజంగానే ఫోన్ దొరకపోతే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
ఓ కేసు విషయంలో దర్యాప్తు కోసం పోలీసులు, మరే ఇతర దర్యాప్తు సంస్థలు ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అడిగినప్పుడు వారికి అందజేయాలన్నారు. కానీ, బండి సంజయ్ తన ఫోన్ ఇవ్వడం లేదంటే కచ్చితంగా పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీలో తన ప్రమేయం ఉందని అంగీకరించినట్టేనన్నారు. అన్ని సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఫోన్ పోయిందంటూ ఇప్పుడు బండి సంజయ్ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. శనివారం రాష్ట్రానికి వచ్చిన మోదీ సూచనతోనే ఇవాళ ఫోన్ పోయిందంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారా అని సతీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.