హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడులో ఓటర్లను గందరగోళపరిచేందుకు బీజేపీ పన్నని కుయుక్తులు లేవు. ముఖ్యంగా గుర్తులతో ఓటర్లను తికమకపెట్టేందుకు నీచ రాజకీయాలకు పాల్పడింది. వ్యూహం ప్రకారమే ఎక్కువమందితో నామినేషన్లు వేయించిన కమలనాథులు వారిలో అత్యధికులకు కారును పోలిన గుర్తులు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. 2011లో తొలగించిన రోడ్‌రోలర్ గుర్తు మళ్లీ ఈ ఎన్నికలో ప్రత్యక్షం కావడమే ఇందుకు ఉదాహరణ అని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. ఈ గుర్తులు దాదాపు కారు గుర్తును పోలి ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురైనట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
కారును పోలిన ఇతర గుర్తులకు తొమ్మిదివేల ఓట్ల వరకు వచ్చాయి. మొదటి ఈవీఎంలో రెండో గుర్తు కారు కాగా, రెండో ఈవీఎంలో రెండో గుర్తు చెప్పు. మొదటి ఈవీఎంలోని రెండో గుర్తు కారుకు ఓటు వేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేయగా, ఓటర్లను గందరగోళపరిచేందుకు రెండో ఈవీఎంలో రెండో గుర్తుగా చెప్పు గుర్తు రావడంతో దానికి రెండువేలకుపైగా ఓట్లు వచ్చాయి. కారును పోలిన గుర్తుల్లో అత్యధికంగా రోటీమేకర్‌కు 2,407ఓట్లు పోల్‌కాగా, చెప్పు గుర్తుకు 2270, రోడ్ రోలర్‌కు 1,874, కెమెరా గుర్తుకు 502, టీవీకి 511, ఐరన్ బాక్స్‌కు 439, బోటుకు 153, గ్యాస్ స్టౌవ్‌కు 312, రేడియోకు 292, బ్యాగ్‌కు 189 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి 10,309 ఓట్ల ఆధిక్యం లభించింది. కారును పోలిన గుర్తులు లేకుంటే తమ మెజార్టీ మరింత పెరిగేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు
తనకు అనుకూలమైన వ్యక్తులతో నామినేషన్లు వేయించడం మొదలు పోలింగ్ రోజు అటెన్షన్ డైవర్షన్ డ్రామాల వరకు బీజేపీ వేయని ఎత్తుగడ లేదు. అయినా ఓటర్లు ఎక్కడా తికమక పడకుండా.. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారు. టీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చడానికి బీఎస్పీ, కేఏ పాల్ వంటి ఊరుపేరు తెలియని వారిని రంగంలోకి దించారు. వాళ్ల ప్రచారానికి కూడా భారీగా నిధులు అందించిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్‌రెడ్డి ముందు నుంచీ ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచిపెట్టినట్టు ఆరోపణలున్నాయి. కొందరు మరో అడుగు ముందుకేసి ఓటర్ల చేతిపై మెహందీతో కమలం గుర్తును వేశారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇచ్చినట్టే ఈ సారి కూడా బీజేపీ నకిలీ హామీలు ఇచ్చింది. పెన్షన్ రూ. 3 వేలు ఇస్తామని, కేంద్రం నుంచి నేరుగా నిధులు తీసుకొస్తామని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇక పోలింగ్‌కు రెండుమూడు రోజల ముందే తనకు జ్వరం వచ్చిందంటూ రాజగోపాల్ రెడ్డి డ్రామా చేశారు. వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా బీజేపీ వేయని ఎత్తుగడ లేదు. చేయని విష ప్రచారం లేదు. సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను, మంత్రివర్గాన్ని, ప్రభుత్వాన్ని అనేక రకాలుగా అవమానించింది. అయితే టీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే సోషల్ మీడియా వేదికగా బీజేపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాయి. ఇవేమీ ప్రజల నిర్ణయాన్ని మార్చలేకపోయాయి. ఓటర్లు ఎక్కడా తికమకపడకుండా టీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేశారు.