MP Soyam Bapu Rao | ఆదిలాబాద్, జూన్ 19 (నమస్తేతెలంగాణ): ఎంపీ ల్యాడ్స్ తన సొంత అవసరాలకు వినియోగించుకున్నానంటూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీగా తనకు సొంత ఇల్లు లేకుంటే విలువ ఉండదని, దీంతోపాటు కుమారుడి వివాహానికి ఎంపీ ల్యాడ్స్ వాడుకున్నానని తెలిపారు. ఏ నాయకుడు కూడా ఈ మాటను ఒప్పుకోడని తాను ఒప్పుకొంటున్నానని చెప్పారు. ఆదిలాబాద్లో ఇటీవల జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. అయితే, తాను వాడుకున్న ప్రతి పైసాను తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంపీ సోయం బాపురావ్ ఎంపీ ల్యాడ్స్ నిధులను సొంత పనుల కోసం వాడుకోవడంపై ప్రతిపక్షాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వ్యాఖ్యలపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన నిధులను తన సొంతానికి వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, ప్రతిపక్షాలు విమర్శలకు దిగిన నేపథ్యంలో సోయం బాపురావ్ మరో వివరణ ఇచ్చారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మీడియాలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని వాపోయారు. తాను ముక్కుసూటిగా ఉండటం కొందరు బీజేపీ నాయకులకు నచ్చడం లేదని, తనను పార్టీలో నుంచి తప్పించడానికి ఈ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎంపీ నిధులు ఏ మాత్రం దుర్వినియోగం కాలేదని, తన సొంత ఇంటి నిర్మాణం, కుమారుడి విహహం సందర్భంగా బిజీగా ఉండటంతో ఎంపీ ల్యాడ్స్ పనులు కార్యకర్తలకు ఇవ్వలేక పోయానంటూ చెప్పుకొచ్చారు.