బొల్లారం, జూన్ 19 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కుండబద్దలు కొట్టారు. క్యాబినెట్ ఆమోదం లేకుండానే అంత భారీ ప్రాజెక్టును ఏ ప్రభుత్వమైనా నిర్మిస్తుందా? అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు క్యాబినెట్ ఆమోదమే లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు బీజేపీ ఎంపీ దీటైన సమాధానమిచ్చారు. కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్లో ఎంపీ ఈటల రాజేందర్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయాన్ని కూడా సొంతంగా అమలు చేయలేదని స్పష్టంచేశారు.
క్యాబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల వాఖ్యలను ఉటంకిస్తూ ఇప్పుడున్న ముగ్గురు మంత్రులు కూడా నాటి క్యాబినెట్లో ఉన్నారని, వారి సమక్షంలోనే క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బట్ట కాల్చి మీద వేయడం సరికాదని హితవుపలికారు. ‘మీ శాఖలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా క్యాబినెట్లో పెట్టండని మంత్రులకు కేసీఆర్ చెప్పేవారు.. కాదంటే నేను దేనికైనా సిద్ధం.. లేదని తేల్చితే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా’ అని సవాల్ విసిరారు. ‘అనేక ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మొదలుపెట్టారు గానీ పూర్తి చేయలేదు. ఐదేండ్లలో పూర్తిచేయాల్సిన ప్రాణహిత-చేవెళ్ల కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయలేదు. పోతిరెడ్డిపాడు పేరుతో అన్యాయంగా మన నీళ్లను తరలించుకుపోతుంటే దుర్మార్గమని చెప్పి పులిబిడ్డలా రాజశేఖర్‌రెడ్డితో కొట్లాడింది.. నేనే’ అని గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఓట్లు వేసిన ప్రజల మీదనే దౌర్జన్యం చేస్తూ అన్యాయానికి ఒడిగట్టాడని ఈటల తీవ్ర విమర్శలు చేశారు. అందులో మొదటిది హైడ్రా అని, హైడ్రాతో సమాజాన్ని ఉద్దరిస్తానని చెప్పి అనేక మంది పేదల ఇండ్లను కూలగొడుతున్నారని మండిపడ్డారు. బాధితులు ఏడ్చినా ఈ ప్రభుత్వానికి కనికరం రాలేదని ఫైర్ అయ్యారు. ‘ప్రభుత్వం ప్రజల కన్నీళ్లు తుడవాలి గానీ, ఈ ప్రభుత్వం ప్రజలకు కన్నీరు పెట్టిస్తున్నది. మూసీ ప్రక్షాళన పేరిట రియల్ వ్యాపారం కోసం కాలనీలను కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.