Kamareddy | వరదలపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని అన్నారు. విపత్తుల సమయంలో ప్రభుత్వం, నేతలు ఏమీ చేయలేరని.. ప్రజలే అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
వరద తక్కువగా ఉన్నప్పుడు బయటికి వస్తే బాగుండేదని ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి తెలిపారు. ప్రజాతప్పిదం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆక్రమణలు కూడా ఇందుకు కారణమే అని చెప్పారు. అధికారులు, ఎమ్మెల్యే కనబడటం లేదని.. ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. ఓటు వేసినందుకు ముడ్డి కడగాలంటే కుదరదని ఘాటుగా విమర్శించారు.
వరదల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించానని.. కానీ ఫొటోలకు పోజులు ఇవ్వలేదని వెంకటరమణ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో మూడు గంటల్లో కుండపోత వర్షం కురిసిందని, జల విలయం సంభవించిందని చెప్పారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కామారెడ్డి చుట్టుపక్కల చెరువులు అలుగు పారాయని, కట్టలు తెగిపోయాయని అన్నారు. ఊహించని నష్టం వాటిల్లిందని తెలిపారు. వర్షాల్లో అధికారులతో కష్టపడి పనిచేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ కొంతమంది సోషల్మీడియాలో ఘోరమైన కామెంట్లు పెడుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప.. ఇలాంటి పిచ్చి కామెంట్లు పెట్టడం సరికాదని హితవు పలికారు. వరదల్లో నేను ఏం చేశానో బాధితులకు తెలుసని వ్యాఖ్యానించారు.