హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): సొంత పార్టీ నేతలను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలోని కొందరు నాయకులు తనను వెన్నుపోటు పొడవడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. గతంలో తనపై పీడీ యాక్ట్ నమోదయ్యేలా చేసింది కూడా బీజేపీలోని కొంతమంది నాయకులనేనని ఆరోపించారు. ‘రాజాసింగ్.. మీపై పీడీ యాక్ట్ పెడుతున్నాం. మీ బీజేపీ వాళ్లు కూడా వేయండి అన్నారు’ అని ఒక పోలీసు అధికారి తనతో చెప్పారని రాజాసింగ్ పేర్కొన్నారు. ‘నేను జైల్లో ఉన్న ప్పుడు నా వెంట నా అన్న ఉన్నాడు. మా కార్యకర్తలు నిలబడ్డారు.
ఈరోజు కూడా నా అన్న నా వెంటే ఉన్నారని నేను అనుకుంటున్నా.. కానీ, మా అన్న ఎటువైపు ఉన్నారో మాకు అర్థం కావడం లేదు’ అంటూ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో రాజాసింగ్ వరుసగా చేస్తున్న ఆరోపణల విషయంలో పార్టీ అగ్ర నాయకులు ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం కూడా రాజాసింగ్ మాట్లాడుతూ, పార్టీ నుంచి పాత సామాన్లను బయట పడేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. గతంలో కొంతమంది గ్రూపిజంతో పార్టీకి నష్టం చేశారని విమర్శించారు. తెలంగాణలో ఏ సీఎం వచ్చినా, అతడితో రహస్య సమావేశాలు నడిపి పార్టీకి నష్టం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా పార్టీ గెలవాలంటే మంచి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు స్వేచ్ఛనివ్వాలని సూచించారు. కొత్త అధ్యక్షుడు సీక్రెట్ మీటింగ్లు పెట్టొద్దని సూచించారు.