హైదరాబాద్, డిసెంబర్21 (నమస్తే తెలంగాణ): గృహలక్ష్మి గ్యారెంటీ కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తామన్న హామీని ఎప్పటి నుంచి అమలు చేస్తారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. విద్యుత్తురంగంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్తు కోసం అప్పులు చెయ్యడం తప్పుకాదని, వాటిని ఎలా వినియోగిస్తున్నామన్నదే ముఖ్యమని పేర్కొన్నారు.
విద్యుత్తురంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం చూస్తే భయమేస్తున్నదని, కేంద్రం చేసిన సాయాన్ని అందులో ఎక్కడా పేర్కొనలేదని విమర్శించారు. 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేందుకు రూ.8,820 కోట్లు అవసరమవుతాయని, విద్యుత్తు సంస్థలు నష్టపోకుండా హామీ ఎలా అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అని ప్రకటించినా, నిర్ణీత యూనిట్లు దాటితే మొత్తం యూనిట్లకు బిల్లు వసూలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా 200యూనిట్ల వరకు పూర్తిగా ఉచిత్ విద్యుత్ ఇవ్వాలని, ఆపైన ఎన్ని యూనిట్లు వస్తే వాటికి మాత్రమే బిల్లు వసూలు చేయాలని కోరారు.