హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): మద్యం ఆదాయంపై ఆధారపడటం లేదంటూనే.. కొత్తగా 70 బార్లకు అనుమతి ఎలా ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో ఎక్సైజ్, టూరిజం పద్దుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటికే 1,171 బార్లు ఉన్నాయని, కొత్తగా ఎలైట్ బార్లు, మైక్రో బ్రూవరీస్‌ను ప్రభుత్వం ప్రారంభించాలనుకోవడం దారుణమన్నారు. మద్యం అమ్మకంతో ప్రభుత్వానికి రూ.27,623 కోట్ల ఆదాయం సమకూరుతున్నట్టు తెలిపారు.
హరీశ్‌బాబు ‘సంఘటన్ మే శక్తి హై’ అని జూపల్లి కృష్ణారావు అన్నారని చెబుతుండగా.. ప్యానల్ స్పీకర్ కల్పించుకొని సబ్జెక్టుపై మాట్లాడాలని సూచించారు. హరీశ్‌బాబు పేరు మర్చిపోయిన ప్యానల్ స్పీకర్ రేవూరి, పక్కనే ఉన్న వ్యక్తిని అడిగి పేరు తెలుసుకున్నారు.