హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి మోసపూరిత బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి అన్నారు. ఇది ఎండమావి బడ్జెట్ అని, కేవలం కాగితాలకే పరిమితమైంది తప్ప.. 80% కూడా ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రెండున్నరేండ్లలోనే రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డ మీద రూ.2 లక్షల అప్పు మోపేందుకు సిద్ధమైందని విచారం వ్యక్తంచేశారు.
నెరవేరని కాంగ్రెస్ హామీలు: మాజిద్ హుస్సేన్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదని మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ ధ్వజమెత్తారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న 130 మంది మైనారిటీ ఉద్యోగులకు దాదాపు 18 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, రంజాన్ పండుగకూ వేతనాలు ఇవ్వకపోతే ఎలా అని మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాజిద్ మాట్లాడారు. మహిళా స్వయంఉపాధి పథకం కింద మైనారిటీ మహిళలకు రూ.50వేల ఆర్థిక సహాయం ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు.
బడ్జెట్‌పై సర్కార్‌కు సీరియస్‌నెస్ లేదు: కూనంనేని
బడ్జెట్ అంచనాల రూపకల్పనలో ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదని, దీనివల్ల అంచనాలకు వాస్తవాలకు పొంతన లేకుండా పోయిందని సీపీఐ పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కేరళ తరహాలో వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ రూపకల్పన జరుగాలని డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర నిధులపై ఆశలు పెట్టుకొని అంచనాలు తయారు చేశారని ఎద్దేవా చేశారు. భూ సమస్యలకు భూభారతితో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని మండిపడ్డారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: సీతక్క
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం, ఉపాధి హామీ పథకంలో మార్పులపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక అసెంబ్లీ వేదికగా బీజేపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చి పథకం స్వరూపాన్ని కేంద్రం దెబ్బతీస్తున్నదని విమర్శించారు. గతంలో 100 రోజులకు వందశాతం నిధులు కేంద్రమే ఇచ్చేదని, ఇప్పుడు 125 రోజులు అని ప్రగల్భాలు పలుకుతూ.. అందులో కేంద్రం వాటాను 60 శాతానికి తగ్గించారని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో మంగళవారం బీజేపీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై సీతక్క స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.