హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సమావేశం అధికారిక కార్యక్రమమా? లేక పార్టీ మీటింగా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలకు ఇబ్బడిముబ్బడిగా వీఐపీ పాసులు ఇవ్వడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన మోదీ, వ్యక్తిగతంగా తెలంగాణ నాయకులను విమర్శించడానికే సభను పెట్టుకున్నట్టు ఉందని పలువురు పేర్కొన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ రైలు ప్రారంభోత్సవానికి శనివారం హైదరాబాద్కు వచ్చిన ప్రధాని మోదీ, అనంతరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్కు పెద్ద సంఖ్యలో వీఐపీ పాసులతో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. తోపులాటలతో సభికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. సభా ప్రాంగణమంతా గందరగోళంగా తయారుగా కాగా, వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటా లు పడాల్సి వచ్చింది. కాగా, ఓ వైపు మోదీ ప్రసంగం నడుస్తుండగానే, సభకు వచ్చిన కార్యకర్తలతోపాటు పలువురు అక్కడి నుంచి నిష్క్రమించడం కనిపించింది.