హైదరాబాద్, మార్చి21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారుపై బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళవారం ఎప్పుడు వస్తుం దా? అప్పులు ఎప్పుడు తెద్దామా? అని ఎదురుచూస్తున్నదని మండిపడ్డారు. ఆర్బీఐ వద్ద అప్పుల చేస్తూ రాష్ర్టాన్ని సంక్షోభం దిశగా తీసుకెళ్తున్నట్టు ఆరోపించారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రె స్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో హామీల ఎగవేతలే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రం లో పంటలు ఎండిపోతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ప్రభుత్వం తెచ్చిన కరువని మండపడ్డారు. ఎండిన పంటలకు ఎకరాకు రూ.20వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా కోసం భూములు తాకట్టు పెట్టి రూ.40 వేల కోట్ల అప్పులు తెచ్చారని విమర్శించారు. అలాగే, అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
వీరిద్దరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల హామీలు, అమలుపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. మోదీ ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని శ్రీధర్‌బాబు విమర్శించగా, దీనిపై మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.15 లక్షల హామీని తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఎక్కడా పెట్టలేదన్నారు. ‘మీకు చేతగాకపోతే చేతగాదని చెప్పండి. అధికారం కోసం తప్పుడు హామీలిచ్చింది మీరు. ముక్కు నేలకు రాసి తప్పైందని ఒప్పుకోండి. పిచ్చిపిచ్చిగా మాపై నిందలు వేస్తే సహించేది లేదు.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌బాబు జోక్యం చేసుకొని ‘కేంద్ర ప్రభుత్వం మాదిరిగా హామీల అమలులో మేం వెనక్కి పోం.. రాసి పెట్టుకోండి’ అంటూ శ్రీధర్‌బాబు సవాల్ విసిరారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై సీఎం, మంత్రులు పూటకో మాట మాట్లాడుతున్నారని మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.