హైదరాబాద్, జనవరి 16 (నమస్తేతెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ జాప్యం చేస్తున్నారని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సుప్రీంకోర్టులో శుక్రవారం కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జారీ చేసిన ఆదేశాలను స్పీకర్ పెడచెవిన పెట్టారని ఏలేటి పిటిషన్లో పేర్కొన్నారు. స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను పక్కనబెట్టారని, ఆయనపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ శాసనసభాపతి తీరుతో ఫిరాయింపులను చట్టబద్ధమయ్యే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. స్పీకర్ అధికారపార్టీకి వత్తాసు పలుకుతూ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నారు. తద్వారా ప్రజాస్వామిక వ్యవస్థ బలహీనమవుతుందని స్పష్టంచేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడిన వీడియోను పిటిషన్‌కు జత చేశారు.