TG Assembly | గవర్నర్ ప్రసంగం విజనరీ డాక్యుమెంట్‌గా ఉంటుందని ఆశించామని.. ప్రసంగమంతా పూర్తి డొల్ల అని అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవని, ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. చేయని పనులు చేసినట్లుగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందనేది అవాస్తవం అన్నారు. ఏవీ ఇవ్వకున్నా.. అన్ని ఇస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారన్నారు.
మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చారా? అని నిలదీశారు. అబద్ధాల పునాదుల మీద ప్రసంగం ఉందని.. నిరుద్యోగ సాధికారిత అని మోసపూరిత మాటలు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారని విమర్శించారు. బీఏసీలో సమస్యలపై చర్చకు ఎక్కువ రోజులు చర్చించేందుకు అసెంబ్లీ నడవాలని కోరామన్నారు. కేవలం ఐదురోజుల్లో ప్రజా సమస్యలపై, బిల్లులపై చర్చ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.