TS Minister Jagadish Reddy | `కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేసే ప్రతి మోసం, నిర్వాకాలు పేద, మధ్య తరగతి ప్రజలతోపాటు రైతాంగం నడ్డి విరిచేటట్లు ఉన్నాయి.. వాటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా రెండు గంటలపాటు వివరిస్తే దానికి కేంద్రం వద్ద సమాధానం లేక ఓ అజ్ఞానితో నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పిస్తున్నారు..నిజం మాట్లాడే శక్తి బీజేపీకి లేదు` అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే మోటర్లకు మీటర్లపై కేంద్ర మంత్రి వివరణ ఇవ్వాలన్నారు.
ఉచిత విద్యుత్, పేదలకు ఉచితాలు, రైతుల మోటర్లకు మీటర్లు తదితర అంశాలను కూడా దేశ భక్తిగా చిత్రీకరిస్తూ ప్రజలను కేంద్రం మోసం చేస్తున్నదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే ప్రజలకు మోదీ, కేంద్రం నిజ స్వరూపం తెలిసిపోయిందని, సరైన సమయంలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రెండూ దొంగాట ఆడుతున్నాయని తెలిపారు. తాము ఉచిత విద్యుత్, మోటర్లకు మీటర్లు బిగించే విషయంలో స్పష్టంగా అసెంబ్లీలోనే వివరించామని, రాష్ట్రాల మెడపై కత్తి పెట్టి మోటర్లు బిగించేలా కేంద్రం ఒత్తిడి చేస్తుందంటూ ఆధారాలతో చూపించామన్నారు.
తాము మోటర్లకు మీటర్లు బిగిస్తామని కేంద్రానికి లేఖ రాసినట్లు బండి సంజయ్ తరచూ అర్థం లేని, పొంతన లేని మాటలు మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనం అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అసలు బండి చెప్పే మాటలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పాలని, దీనిపై ఆయనకు దమ్ముందా అంటూ ప్రశ్నించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చిన ప్రతి సర్క్యులర్‌లో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తప్పకుండా అన్ని కనెక్షన్లకు మీటర్లు పెడితేనే ఆయా రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి 0.5 శాతం పెంచుతామని ఉత్తర్వులు ఇచ్చింది వాస్తవం కాదా అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
ఒకవేళ తాము సాక్షాధారాలతో అసెంబ్లీలో చెప్పిన విషయాలు అబద్ధం అయితే తమ సభ్యులపై ఎందుకు సభా హక్కుల నోటీసు ఇవ్వడం లేదని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. అంతే కాక బీజేపీ ఎమ్మెల్యేలు దీనిపై ఎందుకు మాట్లాడరు..? అని నిలదీశారు. బండి అజ్ఞానం లేదా అబద్ధాలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి కాదని చెప్పారు. నిజాలు మాట్లాడే శక్తి బీజేపీకి లేదన్నారు. గుజరాత్లో రైతాంగానికి మోటార్లు బిగించారని, అక్కడ రైతాంగానికి ఆరేడు గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదని తెలిపారు.
దుర్మార్గంగా విదేశీ బొగ్గు తెచ్చి మన బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసేందుకు నిస్సిగ్గుగా ఉత్తర్వులు ఇచ్చారని, రూ.50లకు యూనిట్ చొప్పున విద్యుత్ అమ్ముకోవచ్చని చెప్పిన కేంద్రానికి సిగ్గుందా? ప్రస్తుతం దేశంలో ఎవరైనా రూ.50 పెట్టి కొనగలరా? అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై బండి లాంటి అజ్ఞాని అందరినీ అనలేదు, కొనేవారికే అన్నాం అంటారు.. మరి పరిశ్రమలు కొని ఉత్పత్తులు చేస్తే ఆ భారం ఎవరిపైన పడుతుందో ఆ అసమర్థ అజ్ఞాని గుర్తెరగాలని హితవు పలికారు.
అసలు విదేశీ బొగ్గు విద్యుత్ ఉత్పత్తి దేనికోసం అంటూ 3,600లకు టన్ను బొగ్గు ఇచ్చేందుకు సింగరేణి సిద్ధంగా ఉంటే మరి రూ.30 నుంచి 40 వేలు అయినా కొనాలనే నిబంధన ఎవరి కోసమో మేధావులకు అర్థం కావట్లేదని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. కేవలం మోదీకి, అదానీకి మాత్రమే ఆ రహస్యం అర్థం అవుతుందని తెలిపారు. కేంద్రం ప్రతి కనెక్షన్‌కు మీటర్ అనే నిబంధన పెట్టడం నిజమని, ఒకవేళ అది మేం అమలు చేస్తే 30 వేల కోట్లు ఎఫ్ఆర్బీఎం వచ్చేది, కానీ ఆ నిధులు ఎందుకు అపారో కూడా ఓ బూత్ లెవల్ నాయకుడైన బండికి తెలియదన్నారు. బండి ఇక్కడ కారు కూతలు కూయడం కాదు ఓ ఎంపీగా పార్లమెంట్లో మాట్లాడాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టుకొని పాలన చేస్తూ దేశ సంపదను అదానీ, అంబీనీలకు దోచి పెడుతున్నాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.