ఖైరతాబాద్, నవంబర్ 12: హైదరాబాద్‌లో పట్టపగలే మరో దారుణం జరిగింది. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం బీజేపీ లీగల్ సెల్ సిటీ కో-కన్వీనర్ ఆవుల కల్యాణ్ వంశీకర్ (45)పై గుర్తుతెలియని ఆగంతకులు విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తితో ఐదు చోట్ల పొడిచాడు. వంశీకర్ తన పెంపుడు కుక్కను తీసుకుని మార్నింగ్ వాక్కు వెళ్లినప్పుడు ఈ ఘ టన జరిగింది. అప్పటికే వంశీకర్ను అనుసరిస్తూ యాక్టివా స్కూటర్‌పై వచ్చిన ఆగంతకులు ఆయనను అటకాయించి ఎదురుగా నిలబడ్డారు. ఓ ఆగంతకుడు కత్తితో వంశీకర్ను విచక్షణారహితంగా పొడిచాడు. ఈ సందర్భంగా వంశీకర్ సెల్‌ఫోన్ కింద పడిపోవడంతో దాన్ని తీసుకుని ఆగంతకులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వంశీకర్.. తన పెంపుడు కుక్కను ఇంటి వద్ద వదిలిపెట్టాక సోదరుడు ఆదర్శ్‌తో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయనను గాంధీ దవాఖానకు తీసుకెళ్లగా.. వైద్యులు అందుబాటులో లేరు. దీంతో బాధితుడిని ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. వంశీకర్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్లోని 309(4), (6) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, చికిత్స పొందుతున్న వంశీకర్ను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పరామర్శించారు. వంశీకర్కు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.