హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తమకు కష్టం వచ్చినప్పుడు నాయకులు అండగా నిలుస్తారనే ఆశతోనే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. కానీ.. భారీ వర్షాలు, వరదల వేళ బీజేపీ నేతలు ఆ నమ్మకాన్ని వమ్ముచేశారు. వానలు, వరదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే పట్టించుకోలేదు. గోదావరి తీర ప్రాంతం జలమయం అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గానీ, ముఖ్యనేతలమని చెప్పుకొనే వారుగానీ కనీసం వెళ్లి పరామర్శించలేదు. ధైర్యం చెప్పలేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతర టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రేయింబవళ్లు అధికారులతో కలిసి పనిచేస్తే.. బీజేపీ నేతలు మాత్రం ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వాన, వరద తగ్గిన తర్వాత వచ్చిన బీజేపీ ఎంపీపై ఇటీవల గ్రామస్థులు దాడిచేయడమే ఇందుకు నిదర్శనం.
వర్షాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాజకీయ ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఊళ్లను వరదలు ముంచెత్తితే ‘కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ర్టాలతో పోల్చితే ప్రాణ నష్టం తెలంగాణలో చాలా తక్కువ. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకపోతే ఇది సాధ్యం అయ్యేదా? అని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు. ఇక పంప్‌హౌజ్ మునకపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ ఆటాడుకున్న సంగతి తెలిసిందే. ‘పంప్ హౌజ్‌ను నది పక్కన కట్టకుండా కిలోమీటర్ల దూరంలో కడతారా?’ అంటూ నిలదీశారు. భారీ వరదలు వచ్చినప్పుడు పంప్‌హౌజ్‌లు మునగడం సర్వ సాధారణమని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పాల్సింది పోయి కరీంనగర్, హైదరాబాద్‌కే పరిమితం అయ్యారని మండిపడుతున్నారు. తానేమీ చేయకపోగా ప్రభుత్వాన్ని నిందిస్తూ.. మరోవైపు ‘ఇంటిమీద కూర్చొని కోళ్లను గెదిమినట్టు’ ఆన్లైన్ పర్యవేక్షణకే పరిమితం అయ్యారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
భారీ వర్షాలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గోవాకు వెళ్లారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్లినట్టు చెప్తున్నారు. వర్షాలతో ప్రజలు అవస్థలు పడుతుంటే ఇక్కడ ఉండి ఆదుకోవాల్సింది పోయి గోవాకు వెళ్లడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వర్షాలు, వరద తగ్గి క్రమంగా కోలుకుంటున్న సమయంలో ‘మేం త్వరలోనే ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తాం’ అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం ప్రకటించడం విశేషం.