హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పగ్గాలు తన అనుంగు శిష్యుడు రేవంత్‌రెడ్డికి ధారాదత్తం అయ్యేలా తెర వెనక చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు తన వ్యూహాన్ని చాపకింద నీరులా అమలు చేస్తున్నారా? తెలంగాణలో తన పార్టీ కనుమరుగు కావడంతో తన అనుచరగణాన్ని ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లోకి చొప్పిస్తున్నారా? తాజాగా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకొనేందుకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి ఈ పరిణామాలపై కాంగ్రెస్‌లోని సీనియర్లు భగ్గుమంటున్నారు. రాష్ట్రంలో టీపీసీసీని చంద్రబాబు టీడీపీసీసీగా మారుస్తున్నారని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఏకంగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్‌తోపాటు కొందరు టీడీపీ నేతలు కాంగ్రెస్‌లో చేరగా.. మరికొందరు బీజేపీకి వెళ్లారు. అలా బీజేపీకి వెళ్లినవారిలో ఎర్ర శేఖర్ కూడా ఒకరు. ఇప్పుడు తన గురువు రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టగానే.. ఎర్ర శేఖర్ బీజేపీకి రాజీనామా చేశారు. రేవంత్ స్వయంగా ఆహ్వానించడంతో ఎర్ర శేఖర్ కాంగ్రెస్ తీర్థం పుచుకోవడానికి సిద్ధమయ్యారు. కాగా, జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్గా అనిరుధ్‌రెడ్డి ఉన్నారు ఎర్ర శేఖర్ పార్టీలోకి వస్తే అనిరుధ్ పరిస్థితి ఏమిటని రేవంత్‌ను కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
హంతకుడిని ఎలా చేర్చుకొంటారు?: కోమటిరెడ్డి ఫిర్యాదు
సొంత సోదరుడిని సర్వీస్ రివాల్వర్‌తో కాల్చి చంపిన కేసులో ప్రదాన నిందితుడుగా ఉన్న ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్‌లో ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్‌కు ఫిర్యాదు చేశారు. హంతకుడిగా ముద్ర ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో పునరాలోచించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన లిఖితపూర్వక ఫిర్యాదులో కోరారు. స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. ఎర్ర శేఖర్‌ను పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.