మహబూబ్నగర్ : రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Minister Srinivas Goud) తెలిపారు. జిల్లా కేంద్రంలోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గోనెల గాయత్రి భవాని, గోనెల రాజేశ్వరి, గోనెల లావణ్య, గోనెల లక్ష్మి, యాదమ్మ, సరస్వతి, మంగమ్మ మరియు నరేష్, రమణ, శ్యామ్, నిరంజన్, రాము, రాజేష్, సాయికిరణ్ సహ సుమారు 50 మందికి పైగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎన్నికలు సమీపిస్తున్నాయని లేనిపోని హామీలు ఇస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థాయి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ముందు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో రూ.200 పెన్షన్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2016, రూ.4016కు పెంచామన్నారు.
మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ఇస్తున్నామని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా అనేక పథకాలు అమతు చేస్తున్నామని తెలిపారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే పార్టీల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రామకృష్ణ, గోనెల సురేష్ తదితరులు పాల్గొన్నారు.