వెనుకటికి ఓ పెద్దమనిషి బజార్లో మేకను కొనుక్కొని ఇంటికి తీసుకుపోతున్నాడట.. దారిమధ్యలో తెలిసిన ఒకతను కనిపించి.. అదేంటి కుక్కను తీసుకుపోతున్నావ్ అన్నాడు.. ఛఛ అట్లా అంటావేంది.. ఇది మేక.. కనిపించట్లేదా అని ఈ పెద్దమనిషి చెప్పాడు.
అలా ముందుకు పోతుంటే.. మరొకతను ఎదురుపడి.. ఏం మాష్టారూ.. కుక్కను తీసుకుపోతున్నారేంటి? అని అడిగాడు.. నువ్వు కూడా అట్లానే అంటున్నవ్.. ఇది కుక్క కాదు.. మేక.. అన్నాడు ఈ పెద్దమనిషి.
ఇంకొంత దూరం పోయాక మూడో మనిషి కూడా మొదటి ఇద్దరి మాదిరిగానే కుక్కను పట్టుకొని పోతున్నారంటూ ఎద్దేవా చేశాడు. దీంతో మేకను పట్టుకుపోతున్న పెద్దమనిషికి అనుమానం మొదలైంది.
తాను కొన్నది మేకే కదా.. వీళ్లంతా ఇలా అంటున్నారేమిటి? అనుకున్నాడు. కొద్ది దూరం పోయాక నాలుగో వ్యక్తి కనిపించి తాను మొదటి ముగ్గురు వేసిన ప్రశ్ననే వేశాడు. దీంతో పెద్దాయన అనుమానం బలపడింది.
తాను కొన్నది మేక కాదు.. కుక్క అని నమ్మాడు. తనను వ్యాపారి మోసం చేశాడని.. ఆ మేకను అక్కడే వదిలి
వెళ్లిపోయారు. ఇతనికి ఎదురుపడ్డ నలుగురు ఆ మేకను పట్టుకొని చక్కగా వండుకొని విందారగించారు.
బీజేపీ వాళ్లు చెప్పిన అబద్ధమే పదే పదే చెప్తారు
ఇవ్వని నిధులను ఇచ్చినట్టు భ్రమ కల్పిస్తారు.
కేంద్ర మంత్రి హోదాలో వచ్చి.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు
సంఘ్‌పరివార్ అంతేవాసులు వచ్చి ఊదర గొడుతుంటారు.
సోషల్ మీడియాలో అదే పనిగా విషం చిమ్ముతారు..
ఈ మాయలో మనం మునిగి పోయామంటే.. మన కొంప మనం ముంచుకొన్నట్టే.. సరైన దిశలో ఆలోచన చేయకపోతే.. విద్రోహ శక్తుల ఉచ్చులో చిక్కుకొని మళ్లీ దశాబ్దాల వెనక్కు పోవడం ఖాయం.
హైదరాబాద్, సెప్టెంబర్ 4, (నమస్తే తెలంగాణ): ఇప్పుడు తెలంగాణలో మేక-కుక్క కథే నడుస్తున్నది. ఒకరు వస్తారు. ఒక అబద్ధాన్ని చెప్పి వెళ్తారు. ఇంకొకరు వస్తారు.. అదే అబద్ధాన్ని మళ్లీ చెప్తారు. ఇవతలి వాళ్లు అది అబద్ధమని ఖండిస్తుంటారు. కానీ అవతలివాళ్లు తాము చెప్తున్న అబద్ధాన్ని మాత్రం వదిలిపెట్టరు. ఒకరి తరువాత ఒకరుగా.. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తుంటారు. అదే అబద్ధాన్ని పదిమంది పది చోట్ల చెప్తారు. చివరకు ఆ అబద్ధాన్నే నిజం అని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ప్రజలను ఒక రకంగా హిప్నటైజ్ చేస్తూ.. తామే గెలుస్తున్నామనే భ్రమ కల్పిస్తారు. తెలంగాణలో బీజేపీ నేతలు ప్రజలతో ప్రస్తుతం ఆడుతున్న ఒక మానసిక క్రీడ ఇది.
కేసీఆర్‌ను అడ్డుకొనేందుకే..
కేంద్రంలో అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీ నేతల కన్ను పచ్చగా ఉన్న తెలంగాణపై పడినప్పటినుంచి ముప్పేట దాడి మొదలుపెట్టింది. జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ మాట్లాడటం మొదలుపెట్టిన నాటినుంచి ఈ దాడి మరింత తీవ్రమైంది. రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేయడం ద్వారా కేసీఆర్‌పై ఒత్తిడి తేవడం.. జైల్లో పెడతాం.. ఈడీని ప్రయోగిస్తామంటూ బెదిరింపు మాటలు మాట్లాడటం ద్వారా కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా వీలైనంత మేరకు అడ్డుకోవడం లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. గత ఎనిమిదేండ్లలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తూ.. బీజేపీ ముక్త్ భారత్ దిశగా విపక్షాలను ఏకం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియని బీజేపీ.. తెలంగాణ సమాజాన్ని ఒకవిధమైన గందరగోళంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.
తెలంగాణ సమాజం తన అస్తిత్వం కోసం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకొన్న రాష్ర్టాన్ని బలహీనపరిచే కుట్రలకు బీజేపీ నాయకత్వం పదును పెడుతున్నది. తమకు కొరకరాని కొయ్యగా మారిన కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసి ఏ విధంగానైనా తెలంగాణలో అధికారం హస్తగతం చేసుకోవడానికి తెలంగాణ వ్యతిరేక శక్తులను బీజేపీ నాయకత్వం అక్కున చేర్చుకొంటున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకం మరోసారి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. రాష్ర్టాన్ని సాధించుకున్నంత మాత్రాన సరిపోదు…దీనిని కాపాడుకోవడానికి ఎల్లవేళలా తెలంగాణ సమాజం ఐక్యంగా ఉండటం ఒక్కటే శ్రీరామరక్ష అని రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాట ఎప్పటికీ సద్దిమూటనేన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతీఘాతక శక్తులకు తెలంగాణ దేశంలోనే ఒక మాడల్ స్టేట్‌గా ఎదగటం కంటగింపుగా మారింది. ఈ శక్తులను అడ్డు పెట్టుకొని తన కండ్లను తానే పొడుచుకొనే విధంగా తెలంగాణ సమాజంపైకి ఉసిగొల్పుతున్నది. ఈ కుయుక్తులను తెలంగాణ ప్రజలు వెయ్యికండ్లతో అప్రమత్తమై తిప్పికొట్టకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందంగా మారే ప్రమాదం పొంచి ఉన్నదని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.
అస్థిరపరిచే కుట్ర
బీజేపీ సర్కార్ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ సంధించిన విమర్శనాస్ర్తాలకు జవాబు చెప్పలేక ఆత్మరక్షణలో పడిన కేంద్రం, దొడ్డిదారిన తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నది. ఆయన్ను రాష్ర్టానికే కట్టడి చేసే వ్యూహంతో మునుగోడు ఉప ఎన్నికను తాజాగా తెరపైకి తెచ్చింది. అంతకుముందు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించి ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొవడానికి మిడతల దాడిలా.. ప్రధాని మోదీ 18 రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర క్యాబినెట్ యావత్తు తరలివచ్చింది. మరోవైపు తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజక వర్గాలకు ఇద్దరేసి కేంద్ర మంత్రుల చొప్పున ఇన్చార్జిలుగా నియమించింది. దాదాపు సగం మంది కేంద్ర మంత్రులు తెలంగాణలోనే తిష్టవేసి కాలుకు బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతున్నారు. ఒక్క జూలై నెలలోనే 8 మంది కేంద్ర మంత్రులు 18 రోజుల పాటు తెలంగాణలోనే ఉన్నారు. ఆగస్టులో 21 మంది కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించారు. వారిలో సగటున ఒక్కోక్కరూ రెండు రోజుల పాటు తెలంగాణలోనే తిష్ట వేసారు.
రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయితే పేరుకే కేంద్ర మంత్రి కానీ ఆయన పూర్తిగా ఇక్కడే మకాం పెట్టారు. జూలై నెలలో కిషన్‌రెడ్డి తెలంగాణలో 13 రోజులు మకాం పెట్టగా, ఆగస్టులో 23 రోజుల పాటు ఇక్కడే ఉండిపోవడం గమనార్హం. రాష్ట్ర పర్యటనకు వచ్చే కేంద్ర మంత్రులు రాసిచ్చిన ప్రింటెడ్ ఆరోపణల ప్రసంగ పాఠాన్ని చదివి వెళ్లడమే పనిగా పెట్టుకున్నారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ పెదవి విప్పనంతవరకు దేశానికే తెలంగాణ రోల్ మాడల్, మార్గదర్శకమంటూ వేనోళ్ల ప్రశంసించిన కేంద్ర మంత్రులు, వారి ఆధీనంలోని సంస్థలు ఇప్పుడు నాలుక మడతేశాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడమే పనిగా పెట్టుకొన్నారు. తెలంగాణ సర్కార్‌ను ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు అందకుండా ఇబ్బంది పెడుతున్నది. ఎఫ్ఆర్బీఎం చట్టానికి వక్రభాష్యం చెప్పి రుణ సమీకరణకూ అడ్డుపడుతున్నది. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం భీష్మించుకొంటే.. సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్లి ధర్నా చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. విభజన చట్టం హామీలను ఎనిమిదేండ్లుగా తుంగలో తొక్కి.. ఆస్తులు, సంస్థలు, ఆర్థిక అంశాల పంపకాలను తేల్చకుండానే ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్తు బకాయిలు చెల్లించాలంటూ తాజాగా పొరుగు రాష్ర్టాన్ని ఉసిగొల్పే ప్రయత్నం చేసింది.
కాళేశ్వరం వంటి ప్రాజెక్టే లేదని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి వినూత్న పథకాలు ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకమన్న కేంద్ర ప్రభుత్వ అధినేతలు ఇప్పుడు అవే నోళ్లతో తెలంగాణను తూలనాడటమే పనిగా పెట్టుకున్నారు. ఎన్ని అబద్ధాలాడినా.. తెలంగాణ సమా జం చాలా చైతన్యవంతమైనది. ఉద్యమకాలం లో వలసపాలకులు, సమైక్యవాదులు చెప్పిన అబద్ధాలు.. చేసిన కుట్రలన్నింటినీ ఛేదించిన చురుకైనవాళ్లు. తాము చెప్తున్న అబద్ధాలన్నీ తమకే బెడిసికొడుతుండటంతో రోజుకో కొత్త పేచీ ముందుకు తెస్తున్నది. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కాంలో సంబంధం ఉన్నట్టు ఢిల్లీ బీజేపీ నేతలతో ఆరోపణలు చేయించారు. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలన్న లక్ష్యం నెరవేరకపోగా.. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొంటే.. పోటీగా వాళ్లూ చేయ డం మొదలైంది. తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగిడి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో కేసీఆర్ ఉత్సవాలు ప్రకటించగానే.. తామూ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ భవిష్యత్తు గురించి భావి తరాల గురించి ఆలోచిస్తున్నారు. బీజేపీ నేతలు సమాజాన్ని కలచివేసి సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఇలాంటివి ఎన్నింటినో చవిచూసింది. కానీ..అయినప్పటికీ.. తస్మాత్ జాగ్రత్త..