జనగామ : జనగామ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ నాయకులపై బీజేపీ శ్రేణులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు.

ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై నిన్న రాజ్యసభలో చేసిన విషపు వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కూడా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీని కూడా బీజేపీ నాయకులు అడ్డుకుని దాడి చేశారు. మొత్తంగా జనగామ చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.